ఒక్క అవకాశమివ్వండి : అదితి

May 11,2024 21:40

ప్రజాశక్తి- విజయనగరం కోట : ఈ సారి తనకు ఒక అవకాశమివ్వాలని టిడిపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పూసపాటి అదితి గజపతిరాజు కోరారు. శనివారం పట్టణంలోని 45వ డివిజన్‌ కామాక్షినగర్‌, కృష్ణుడి కోవెల ఏరియా, కె.ఎల్‌.పురం, రామాలయం వీధి, రాజులకొలనీ ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు ప్రకటించిన సూపర్‌సిక్స్‌ పథకాలు, హామీల పట్ల ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడగలిగే నాయకుడు చంద్రబాబు నాయుడు అని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. విజయనగరం ప్రజల కోసం ముషిడిపల్లి మంచి నీటి పథకం, నాగావళి చంపావతి నదుల అనుసంధానం ద్వారా విజయనగరం ప్రజల దాహార్తిని తీర్చిన ఘనత టిడిపిదేనన్నారు. నగరంలో ప్రజలు మంచి నీటి సమస్యను ఎదుర్కొంటున్నారని తనను గెలిపిస్తే సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. గడిగెడ్డ రిజర్వాయరు పనులు టిడిపి ప్రభుత్వంలో ప్రారంభిస్తే వైసిపి వచ్చాక ఆ పనులను గాలికి వదిలేశారన్నారు. ఇటువంటి ప్రజా ఉపయోగ పనుల గురించి ముఖ్యమంత్రికి వివరించే ధైర్యం స్థానిక ఎమ్మెల్యేకి లేదన్నారు. ఎప్పుడు ఆయన తన స్వంత వ్యాపారాలు, స్వలాభం కోసమే ఆలోచిస్తారని, బలవంతపు వసూళ్లు చేయడం, వ్యాపారం చేసేవారి నుంచి వాటాలు తీసుకోవడం వంటివి చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ప్రజల ఆస్తులను దోచుకోవడానికి ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ తీసుకువచ్చారని చెప్పారు. ఆమెకు మద్దతుగా చెల్లి పూసపాటి విద్యావతి దేవి 25వ డివిజన్‌ రంగాల వీధి, కర్రల మార్కెట్‌, కోళ్ల బజార్‌, డాబాతోట ఇంటింటా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, కార్యాలయ కార్యదర్శి రాజేష్‌బాబు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌, కార్యదర్శి బంగారుబాబు, మండల అధ్యక్షులు బొద్దల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోలినాయుడు, వేచలపు శ్రీనివాసరావు, అవనాపు విజరు, పిల్లా విజరు కుమార్‌, గాడు అప్పారావు, కొండ్రు శ్రీనివాసరావు, పైడిరాజు, బిజెపి, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

➡️