‘ఉక్కు’ శంకస్థాపనలకే పరిమితంజగన్‌ మారారు..

ప్రజాశక్తి – కడప ప్రతినిధి/కడప/వేంపల్లె/ఖాజీపేట
కడప ఉక్కు పరిశ్రమను శంకుస్థాపనలకే పరిమితం చేశారని పిసిసి అధ్యక్షులు వై.ఎస్‌.షర్మిల విమర్శించారు. సోమవారం కడప నగర శివారులోని జయరాజ్‌ గార్డెన్‌లో పిసిసి మీడిj చైర్మన్‌ తులసిరెడ్డి అధ్యక్షతన కడప, అన్నమయ్య జిల్లాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ తన తండ్రి వైఎస్సార్‌ బ్రతికి ఉంటే కడప జిల్లాకు కడప పరిశ్రమ వచ్చేదన్నారు. ఈ పరిశ్రమ వల్ల 20 వేల ఉద్యోగాలు వచ్చేవి, లక్ష మందికి పరోక్షంగా ఉపాధి దొరికేదని తెలిపారు ఉక్కు పరిశ్రమ ఒక కలగానే మిగిలిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ కడప స్టీల్‌ ప్రాజెక్ట్‌ను విభజన హామీల్లో పెట్టింది, చంద్రబాబు రూ.18 వేల కోట్లతో మళ్ళీ శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. బాబు 5 ఏళ్లలో కడప స్టీల్‌ పై నిర్లక్ష్యం వహించారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతగా జగన్‌ దీక్షలు కూడా చేశారని ముఖ్యమంత్రి అయ్యాక జగన్‌ రెండు సార్లు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. కడప స్టీల్‌ను శంకుస్థాపన ప్రాజెక్ట్‌గా మార్చారని విమర్శించారు. నాన్న రాజశేఖర్‌రెడ్డి రక్తమే నా ఒంట్లో ప్రవహిస్తుందన్నారు. పులి కడుపున పులే పుడుతుందన్నారు. మార్క్‌ రాజకీయాలకు వైయస్సార్‌ కేరాఫ్‌ అడ్రస్‌ అని పేర్కొన్నారు. కడప నా పుట్టినిల్లు, జగన్‌ లాగే నేను ఇక్కడే పుట్టానని తెలిపారు. జగన్‌ అప్పటి మనిషి కాదన్నారు. ఇప్పటి జగన్‌ను ఎప్పుడూ చూడలేదన్నారు. వైసిపి కోసం నిస్వార్థంగా పనిచేశానని తెలిపారు. కార్యక్రమంలో సిడబ్ల్యూసి సభ్యులు ఎన్‌.రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, కొప్పుల రాజు, పల్లంరాజు, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.తులసిరెడ్డి, మాజీ కేంద్ర మంత్రి జెడి. శీలం, కడప జిల్లా అధ్యక్షులు గుండ్లకుంట శ్రీరాములు, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు అల్లా బకాష్‌, కాంగ్రెస్‌ పార్టీ కడప నగర అధ్యక్షులు వై. విష్ణు ప్రీతం రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు నజీర్‌ అహ్మద్‌, బండి జకరయ్య, ప్రభాకర్‌, గొల్లు కృష్ణారావు, మాజీ మంత్రి అహ్మదుల్లా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జంగా గౌతమ్‌, సుంకర పద్మశ్రీ, రాజేష్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కమలమ్మ, రాష్ట్ర మహిళా అధ్యక్షులు తాంతియా కుమారి పాల్గొన్నారు. ఇడుపులపాయలో షర్మిలతో సునీత భేటీ వైఎస్‌ఆర్‌ జిల్లా వేంపల్లె మండలంలోని ఇడుపులపాయలో బస చేసిన పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిలతో మాజీ మంత్రి వైఎస్‌.వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్‌ వైఎస్‌.సునీత భేటి ఆయ్యారు. సోమవారం ఉదయం సునీత హైదరాబాద్‌ నుంచి నేరుగా ఇడుపులపాయకు చేరుకొని తన సోదరి షర్మిలతో భేటీ అయ్యారు. వ్యవసాయ క్షేత్రంలో ఉన్న వైఎస్‌ఆర్‌ సమాధి వద్దకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో కలిసి షర్మిల, సునీత వెళ్లి వైఎస్‌ఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు. షర్మిలతో సునీత రెండు పాటు గెస్ట్‌హౌస్‌లో భేటి అయ్యారు. వారివురు భేటి కావడంతో సునీత కాంగ్రెస్‌లో చేరుతారనే వాటిపై రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ భేటీలో కీలకమైన అంశాలు మాట్లాడినట్లు తెలిసింది. ముందు నుంచి వివేకా హత్యలో పోరాడుతున్న సునీతకు షర్మిల మద్దతు పలుకుతూనే ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల, కడప నుంచి కాంగ్రెస్‌ పార్టీ నుంచి బలమైన వ్యక్తిని నిలబెట్టేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం చూస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో షర్మిలను వివేకా కుమార్తె సునీత కలవడం చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్‌ కుటుంబానికి దూరంగా ఉన్న సునీత ఇప్పుడు షర్మిలని కలవడం రసవత్తర రాజకీయానికి తెరలేపినట్లయింది. వైఎస్‌ఆర్‌కు నివాళులర్పించిన అనంతరం షర్మిల కాంగ్రెసు పార్టీ విస్తత సమావేశానికి కడపకు వెళ్లాగా, సునీత పులివెందులకు వెళ్లారు. – ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ సమాధికి నివాళులర్పిస్తున్న షర్మిల, సునీత

➡️