రహదారుల భద్రతలో సామాజిక బాధ్యత వహించాలి : కలెక్టర్‌

ప్రజాశక్తి – కడప రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో ట్రాఫిక్‌ నిబంధనలతో పాటు తల్లిదండ్రులు కూడా సామాజిక బాధ్యత వహించాలని కలెక్టర్‌ వి.విజరు రామరాజు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని విపి హాలులో జిల్లా రవాణా శాఖ డిటిసి మీరా ప్రసాద్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 35వ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు సభకు కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19 వరకు రవాణా శాఖ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు నిర్వహించిన ‘జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు’ లో భాగంగా ఆ శాఖ అధికారులు నిర్వహించిన పలు అవగాహన కార్యక్రమాలతో ప్రజల్లో ముఖ్యంగా యువతలో మరింత అవగాహన పెరిగి ఉంటుందని విశ్వసించారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల నివారణలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించిన ప్రభుత్వ సూచనలపై ప్రజల్లో అవగాహన కలిగి ఉండాలన్నారు. రోజూ ఉదయం సంతోషంగా ఇంటి నుండి బయటకు వచ్చిన వ్యక్తి, వారి విధులు ముగించుకుని సాయంత్రం తిరిగి అదే సంతోషంతో సురక్షితంగా ఇంటికి చేరుకోవాలన్నారు. ఒక కుటుంబంలో సంపాదనపరుడు రహదారి ప్రమాదంలో మరణించినట్లయితే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడటానికి ఒక తరం కాలం పడుతుందని, ప్రతి ఒక్కరు కూడా రహదారి నియమాలపై కనీస అవగాహన పెంచుకోవాలన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే చోటు చేసుకునే అనర్థాలు, ప్రమాదాలు, ప్రాణ నష్టం.. తద్వారా కుటుంబంలో వ్యక్తులను కోల్పోతే ఎదురయ్యే పరిస్థితులను తల్లిదండ్రులు తమ పిల్లలకు తెలియజేయాలన్నారు. పిల్లల్లో సామాజిక విలువలను నేర్పించినపుడే ప్రాణం విలువ తెలియడంతో పాటు క్రమశిక్షణ అలవడుతుందన్నారు. డిటిసి మాట్లాడుతూ రోడ్లు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా వాహన యజమానులు, వాహన డ్రైవర్లు, ప్రజలు. విద్యార్థులకు రహదారి భద్రత, రోడ్‌ సేఫ్టీ ఆడిట్‌ మొదలగు విషయాలపై వివిధ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించామన్నారు. ప్రజా రవాణా వ్యవస్థలో డ్రైవర్లు మితిమీరిన వేగంతో, నిర్లక్ష్యంతో వాహనాలు నడపడం ఎంత ప్రమాదకరమో వివరించారు. అనంతరం రహదారి భద్రత కోసం కషి చేసిన అధికారులకు, సంస్థలకు జిల్లా కలెక్టర్‌ ప్రశంసా పత్రాలు అందించారు. రహదారి భద్రతపై రవాణా శాఖ వారు విద్యార్థులకు నిర్వహించిన క్విజ్‌ , వ్యాసరచన, డ్రాయింగ్‌ పోటీలలో ప్రథమ, ద్వితీయ, మరియు తతీయ స్థానాలు పొందిన వారికి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు, నగదు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఆర్‌టిసి ఈడి (జోన్‌-4) వెంకటేశ్వరరావు, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ. మహేశ్వర్‌ రెడ్డి, ఆర్టీవో మురళీధర్‌, ఎంవిఐ విజరు భాస్కర్‌, ఎఎంఐవిలు లక్ష్మీ ప్రసన్న, అన్ని శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రవాణా శాఖ కానిస్టేబుల్స్‌, హౌంగార్డ్స్‌, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు, డ్రైవర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️