ఇవిఎం, వివిప్యాట్స్‌కు పటిష్ట భద్రత

Mar 22,2024 22:14
ఇవిఎం, వివిప్యాట్స్‌కు పటిష్ట భద్రత

ప్రజాశక్తి-కాకినాడలోక్‌ సభ, శాసనసభ-2024 ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ విడుదల చేసిన నేపథ్యంలో రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఇవిఎం, వివి.ప్యాట్‌ గోదాముకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్‌ వద్ద ఉన్న ఇవిఎం, వివి.ప్యాట్‌ గోదామును శుక్రవారం కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా రెవెన్యూ, ఎన్నికలు, అగ్నిమాపక, జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనీఖి చేశారు. ఇవిఎంల రక్షణ, భద్రతకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులను వివరాలు ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ కతికా శుక్లా మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం మార్గనిర్ధేశాల మేరకు ప్రతి నెలా ఇవిఎం, వివి.ప్యాట్‌ గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి, సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఇవిఎం, వివిప్యాట్స్‌ క్షుణ్నంగా పరిశీలిస్తామన్నారు. సాధారణ ఎన్నికలు 2024 సంబంధించి షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో ఎన్నికలు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు సమన్వ యంతో వ్యవహరించి ఇవిఎం, వివి.ప్యాట్‌ గోదాము భద్రతపై అప్రమత్తతో వ్యవహరించాలని కలెక్టర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్‌ డి.తిప్పే నాయక్‌, కాకినాడ ఆర్‌డిఒ ఇట్ల కిషోర్‌, అగ్నిమాపక శాఖ అధికారి ఏసుబాబు, తహశీల్దార్‌ కె.చెల్లన్నదొర, రాజకీయ పార్టీల ప్రతినిధులు జి.సాయిబాబా (టిడిపి), ఆర్‌.వెంకటేశ్వరరావు (వైసిపి), కె.విజయ రామయ్య(బిజెపి), ఎస్‌.అప్పారావు (బిఎస్‌పి), వాసంసెట్టి చంద్రరావు (సిపిఎం) కలెక్టరేట్‌ డిటి ఎం.జగన్నాథం పాల్గొన్నారు.

➡️