కాంగ్రెస్‌ అభ్యర్థుల ఖరారు

Apr 2,2024 22:39
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ పోటీ

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి

రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ పోటీ చేస్తున్న స్థానాలను పార్టీ అధిష్టానం మంగళవారం ప్రకటించింది. కాకినాడ పార్లమెంటు స్థానానికి కేంద్ర మాజీ మంత్రి ఎంఎం.పల్లం రాజు, రాజహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా గిడుగు రుద్రరాజు పేర్లు ఖరారు అయ్యాయి. అలాగే కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల్లో పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించారు. తుని నుంచి గాలెం శ్రీనివాసరావు, ప్రత్తిపాడు నుంచి ఎన్‌వివి.సత్యనారాయణ, పిఠాపురం నుంచి మాదేపల్లి సత్యానందరావు, కాకినాడ రూరల్‌ స్థానం నుంచి పిల్లి సత్యలక్ష్మి, పెద్దాపురం తుమ్మల దొరబాబు, అనపర్తి డాక్టర్‌ యల్ల శ్రీనివాసరావు, కాకినాడ సిటీ చెక్క నూకరాజు, రామచంద్రాపురం కోట శ్రీనివాసరావు, ముమ్మిడివరం పాలెపు ధర్మారావు, అమలాపురం(ఎస్‌సి) అయితాబత్తుల సుభాషిణి, రాజోలు(ఎస్‌సి) సరళ ప్రసన్నకుమార్‌, కొత్తపేట నుంచి రౌతు ఈశ్వరరావు, మండపేట నుంచి కామన ప్రభాకర్రావు, రాజానగరం నుంచి ఎం.వెంకట శ్రీనివాస్‌, రాజమహేంద్రవరం సిటీ నుంచి బోడా లక్ష్మీవెంకటప్రసన్న, రాజమహేంద్రవరం రూరల్‌ స్థానం నుంచి బాలేపల్లి మురళీధర్‌, జగ్గంపేట నుంచి మారోతు వివి.గణేశ్వరరావు, కొవ్వూరు(ఎస్‌సి) అరిగెల అరుణకుమారి, నిడదవోలు నుంచి పెద్దిరెడ్డి సుబ్బారావు పేర్లను ప్రకటించారు.మళ్లీ ఎన్నికల బరిలోకి పల్లం రాజుకాకినాడ జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి ఎంఎం. పళ్ళంరాజు పదేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. కాకినాడ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా అధిష్టానం ఆయన్ని bంపిక చేసింది. సుదీర్ఘకాలంగా కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంతో ఆయన కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది. ఆయన తాత, తండ్రి కూడా కాకినాడ పార్లమెంటు స్థానానికి ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించారు. తాత పళ్లంరాజు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. తండ్రి సంజీవరావు ఇందిరా గాంధీ మంత్రివర్గంలో ఎలక్ట్రానిక్స్‌ మంత్రిగా సేవలందించారు. ఈయన మూడు సార్లు ఎంపీగా విజయం సాధించారు. రెండు సార్లు కేంద్రమంత్రిగా పని చేశారు. మన్మోహన్‌ సింగ్‌ కేబినెట్‌లో రక్షణ,మానవ వనరుల శాఖామంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014, 2019 ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. పిసిసి అద్యక్షులు షర్మిల, రాహుల్‌ సూచనల మేరకు ఆయన మళ్లీ పోటీకి దిగుతున్నారు.పళ్లం రాజు తొలిసారిగా 1989 ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1991లో తోట సుబ్బారావు చేతిలో ఓటమి పాలయ్యారు. 1996, 98, 99 ఎన్నికల్లో కూడా ఆయనకు ఓటమి తప్పలేదు. 1999 ఎన్నికల్లో మాత్రం అసెంబ్లీకి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2004లోనూ, 2009 లోనూ వరుసగా విజయం సాధించారు. 2014లో మాత్రం కాంగ్రెస్‌ పరిస్థితి పూర్తిగా తారుమారు కావడంతో పళ్ళంరాజు ఆశలు గల్లంతయ్యాయి. 2019 ఎన్నికల్లో బరిలోకి దిగుదామని ఆశించినా పరిస్థితులు కలిసి రాలేదు. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల్లో ఆయన బరిలోకి దిగడంతో ఆసక్తికరంగా మారింది. ఈ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో రాజకీయంగా చర్చనీయాంశం కాబోతుంది. మెట్ట ప్రాంతంలో సొంత సామాజిక వర్గంలో ఈయనకు ఫాలోయింగ్‌ కూడా ఉంది. జిల్లా వ్యాప్తంగా బంధుత్వాలు కూడా ఉన్నాయి. అనుచరులు కూడా పెద్ద సంఖ్యలోనే నేటికీ ఉన్నారు. దీంతో ఆయన గెలుపే లక్ష్యంగా ప్రచారం జరుపనున్నారు.అలాగే రాజమహేంద్రవరం నుంచి సీనియర్‌ నాయకులు గిడుకు రుద్రరాజు బరిలోకి దిగనున్నారు. కాంగ్రెస్‌లో ఆది నుంచి ఆయన పెద్ద నాయకునిగా ఉన్నారు. ఆయన కూడా ఈ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

➡️