పెద్దాపురం నుంచే పోటీ చేస్తా: చినరాజప్ప

Feb 21,2024 23:16
పెద్దాపురం నియోజకవర్గం

ప్రజాశక్తి – పెద్దాపురం

పెద్దాపురం నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. బుధవారం ఆయన స్థానిక మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాను ఇక్కడ నుంచి పోటీ చేయడం లేదని తానంటే గిట్టని వారు లేనిపోని ప్రచారాన్ని చేస్తున్నారని అన్నారు. తనకు ఆరోగ్యం బాగాలేదని సోషల్‌ మీడియాలో కొందరు వీడియోలు విడుదల చేయటం దారుణమన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ తనను ఎన్నికల ప్రచారం చేసుకోమని చెప్పారన్నారు. తాను 2014లో పెద్దాపురం ఎంఎల్‌ఎగా విజయం సాధించిన తరువాత నియోజకవర్గంలో రూ.1000 కోట్లతో అభివృద్ధి పనులు చేశానన్నారు. 2019లో పెద్దాపురం ప్రజలు తనకు 2వ సారి ఎంఎల్‌ఎగా అవకాశం ఇచ్చారని, తాను నిరంతరం నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతూ ప్రజలతోనే ఉన్నానని తెలిపారు. తాను చేసిన అభివృద్ధిని చూసే ప్రజలు రెండోసారి తనకు అవకాశం ఇచ్చారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు అడబాల కుమార్‌ స్వామి తదితరులు పాల్గొన్నారు.

➡️