ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడండి:యనమల

Mar 6,2024 23:36
రానున్న ఎన్నికల్లో ఓటు

ప్రజాశక్తి – కోటనందూరు

రానున్న ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలని టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ప్రజలను కోరారు. బుధవారం రాత్రి టిడిపి మండల అధ్యక్షులు గాడి రాజబాబు, మాజీ ఎంపిపి దంతు లూరి చిరంజీవ రాజు ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, చింతకాయల అయ్యన్న పాత్రుడు హాజరయ్యారు. తొలుత యనమల మాట్లాడారు. ఓటును అమ్ముకుంటే జీవితాలు నాశనమవు తాయన్నారు. వ్యవస్థ దుర్వినియోగం అవుతుందన్నారు. నేడు పాలించే పాలకులంతా వ్యాపారస్తులేననన్నారు. అక్రమంగా సంపాదించిన ధనంతో ఓటర్లను ప్రలోభ పెట్టి, ఓట్లను కొనుగోలు చేసుకుంటున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ఇలాంటి నాయకులకు ప్రజలు చెక్‌ పెట్టాలన్నారు. అనంతరం మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడారు. హామీలను అమలు చేయడంలో జగన్మోహన్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారన్నారు. బ్రాందీషాపులపై రూ.8,300 కోట్లు అప్పు తెచ్చారన్నారు. 25 ఏళ్లకు ఒప్పందం కుదుర్చుకొని మద్యం దందా నిర్వహిస్తున్నారని విమర్శించారు. ప్రజల సొంత భూములను, ఆస్తులను స్వాధీనం చేసుకుని వాటిపై అప్పులు చేసే ఆలోచనలో జగన్మోహన్‌రెడ్డి ఉన్నారన్నారు. టిడిపి తుని నియోజకవర్గ ఇన్‌ఛార్జి యనమల దివ్య మాట్లాడుతూ తనను గెలిపిస్తే తాండవ రిజర్వాయర్‌ను అభివృద్ధి చేస్తానన్నారు. అనంతరం కోటనందూరుకు చెందిన నాయకుల వి.వెంకట గంగాధర్‌రంగ నాయకులు, వెలగా వెంకటకృష్ణారావు, కోన వీరబాబు, పల్లా రామకృష్ణుడు ఆధ్వర్యంలో పలువురు టిడిపిలో చేరారు. వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

➡️