మత్స్యకారుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

Mar 11,2024 23:37
జిల్లాలో కోనపాపపేట

ప్రజాశక్తి – కాకినాడ

జిల్లాలో కోనపాపపేట అరవిందో ఫ్యాక్టరీ, ఒఎన్‌జిసి సంస్థల పైపులైన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న మత్స్యకారుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎపి మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక సుందరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లాటి శ్రీనివాసురావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా తీర ప్రాంతం నుంచి మత్స్యకారులను తరిమేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని అన్నారు. జిల్లాలో కోనపాప పేట గ్రామంలో అరవిందో ఫార్మా కంపెనీ, కాకినాడ నగరానికి ఆనుకుని ఉన్న ఏటిమొగ వద్ద ఒఎన్‌జిసి సంస్థలు పైపులైన్లు వేయడం వల్ల సముద్రంలో వేటాడే సమయంలో మత్య్సకారులు అనేక ఇక్కట్లను ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. సముద్రంలో వేట వేసినా చేపలు పడకపోవడం వల్ల మత్య్సకారులు తీవ్రంగా నష్ట పోతున్నారని అన్నారు. తక్షణమే మత్య్సకారులకు శాశ్వత నష్టపరిహారం చెల్లించేలా గ్యారంటీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఫార్మా కంపెనీ వెదజల్లే విషరసాయన వ్యర్ధాల వల్ల మత్య్స సంపద నాశనం అవుతుందని, దీనిద్వారా మత్య్సకారలు ఉపాధిని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా మత్య్సకారులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం, అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మత్స్యకారులకు అన్యాయం జరుగుతున్న పాలక, ప్రతిపక్ష నేతలు వ్యవహరిస్తున్న తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్రి చంద్రశేఖర్‌, రాష్ట్ర సహాయ కార్యదర్శి రమణి, వైదాని శివ, మల్లాడి రామకృష్ణ, ఓలేటి మహేష్‌, ఎం శివకుమార్‌, జి.భూలక్ష్మి పాల్గొన్నారు.

➡️