మూడో జాబితాలో ముగ్గురు

Mar 22,2024 22:10
మూడో జాబితాలో ముగ్గురు

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధిసార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటికీ కూటమి తమ అభ్యర్థుల ప్రకటనలో ఇంకా జాప్యం చేస్తూనే ఉంది. తాజాగా శుక్రవారం ఎట్టకేలకు మూడో జాబితా విడుదల చేసింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో అమలాపురం పార్లమెంట్‌ స్థానానికి గంటి హరీష్‌మాథూర్‌, కాకినాడ సిటీ అసెంబ్లీ స్థానానికి వనమాడి కొండబాబు, అమలాపురం అసెంబ్లీ స్థానానికి అయితాబత్తుల ఆనందరావు పేర్లను ఖరారు చేసింది. అయితే రాజమహేంద్రవరం పార్లమెంట్‌, పి.గన్నవరం అసెంబ్లీ అభ్యర్థులపై ఇంకా కూటమి నేతలు కసరత్తులు చేస్తూనే ఉన్నారు. అధికార పక్షం అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాలను ప్రారంభించారు. ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగమయ్యారు. ప్రకటించిన స్థానాల్లో కూటమి అభ్యర్థుల సైతం ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో పెండింగ్‌ ఉన్న స్థానాల్లో టికెట్లను ఆశిస్తున్న నేతల్లో ఆందోళన నెలకొంది. ఎవరికి సీటు దక్కుతుందనే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. మిగిలిన స్థానాలను కూడా త్వరితగతిని ప్రకటించాలని టిడిపి, జనసేన పార్టీల శ్రేణులు కోరుతున్నాయి. కూటమి అభ్యర్థిగా లోక్‌ సభ మాజీ స్పీకర్‌ జిఎంసి బాలయోగి కుమారుడు గంటి హరీష్‌మాథూర్‌ను మరోసారి అమలాపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ సీటుపై టిడిపి అధిష్టానం తీవ్ర కసరత్తులు చేసింది. ఉమ్మడి జిల్లాలో డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం కీలకంగా మారడంతో దీన్ని టిడిపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ స్థానానికి మాజీ ఎంపీ ఎజెవిబి.బుచ్చిమహేశ్వరావు కుమార్తె డాక్టర్‌ సత్యశ్రీ, ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్‌ యాతాటి రమేష్‌బాబు పోటీపడ్డారు. వారి బలాలు, బలహీనతలను బేరీజు వేసిన టిడిపి అధినేత చంద్రబాబు చివరకు హరీష్‌మాథూర్‌కే మొగ్గుచూపారు. మరోవైపు అమలాపురం అసెంబ్లీ స్థానంపైనా అధినేత ఆచితూచి నిర్ణయం తీసుకున్నారు. సామాజిక సమీకరణలు, అర్థ, అంగబలం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఆనందరావుకు టికెట్‌ను ఖరారు చేశారు. ఈ స్థానాన్ని మాజీ ఎంఎల్‌ఎ చిల్లా జగదీశ్వరి, టిడిపి సీనియర్‌ లీడర్‌ పడమటి శ్యామ్‌కుమార్‌ తదితరులు ఆశిస్తూ వచ్చారు. జగదీశ్వరి పలు సందర్భాల్లో అమలాపురం నుంచి పోటీకి సిద్ధమంటూ ప్రకటించారు. అయినప్పటికీ చంద్రబాబు ఆనందరావుకే టిక్కెట్‌ను కేటాయించారు. కాకినాడ సిటీ నియోజకవర్గంలో ఉత్కంఠకు తెరపడింది. మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబుకే ఈ సీటు దక్కింది. టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుణ్ణం చంద్రమౌళి ఈ టిక్కెట్టు కోసం గట్టి ప్రయత్నాలే చేసినా ఫలించలేదు. మరోవైపు బిజెపి కూడా ముమ్మర ప్రయత్నాలు చేసింది. పోతుల విశ్వం, గట్టి సత్యనారాయణ వంటి నాయకులు పలుమార్లు ముఖ్య నేతల వద్దకు వెళ్లి తమ నిర్ణయాలను చెప్పుకున్నారు. తాజాగా టిడిపి నుంచి కొండబాబుకు టికెట్‌ కేటాయించడంతో బిజెపి ఆశావహుల్లో అసంతృప్తి నెలకొంది. ఎన్నికల్లో కొండబాబుకి సహకరించేది లేదంటూ ఆ పార్టీ శ్రేణులు నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు టికెట్‌ ఆశించి భంగపడ్డ చంద్రమౌళి కూడా తీవ్ర నిరాశతో అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. పార్టీకి ఆర్థికంగా అనేక సహాయ, సహకారాలు అందజేసినా తనకు సరైన గుర్తింపు లేదని మదన పడుతున్నారు. రెబల్‌గా సిటీ నియోజకవర్గ నుంచి పోటీలో ఉండాలని అనుచరులు కోరుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.మిగిలిన స్థానాల్లో ఉత్కంఠమిగిలిన స్థానాల్లో అభ్యర్థులను ఇంకా ప్రకటించకపోవడంతో కూటమి ఆశావహుల్లో ఇంకా ఉత్కంఠ కొనాసాగుతోంది. రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానం దాదాపుగా బిజెపికి ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశం ఉంది. అయితే అధికారికంగా దీనిపై ఇంకా ప్రకటన వెలువడలేదు. త్వరలోనే ఈ మేరకు ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అలాగే పి.గన్నవరం అసెంబ్లీ స్థానం అభ్యర్థిపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. మహాసేన రాజేష్‌కు టికెట్‌ కేటాయించినప్పటికీ కొన్ని రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడంతో ఆయన పోటీ నుంచి వెనక్కి తగ్గినట్టు ప్రకటించారు. ఇదే స్థానాన్ని జనసేన నుంచి తెలంగాణ రిటైర్డ్‌ పోలీస్‌ ఉన్నతాధికారి గిడ్డి సత్యనారాయణ ఆశిస్తున్నారు. అందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు బిజెపి కూడా ఈ స్థానంపై పట్టుబడుతుతోంది. అమలాపురం ఎంపీ చింతా అనురాధ భర్త టిఎస్‌ఎన్‌.మూర్తి గతంలోనే బిజెపిలో చేరారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఆయన మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారిగా ఉన్నారు. బిజెపి నుంచి ఆయన్ని బరిలో దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా టిడిపి మూడో జాబితా ప్రకటనతో జిల్లాలో ఎన్నికల సందడి మరింత ఊపు అందుకుంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు పోటాపోటీగా ప్రచార పర్వంలో ఉన్నారు. ఏ ఇద్దరు కలిసినా అభ్యర్థుల గెలుపు, ఓటమిలపైనే చర్చ జరుగుతోంది. ఎక్కడ చూసినా ఎన్నికల సమావేశాలు, సమాలోచనలు, ఎక్కడ విన్నా అభ్యర్థుల బలాబలాలు వంటి అంశాలనే మాట్లాడుకుంటున్నారు.

➡️