కోరం పైనే చర్చ  

Mar 11,2024 14:39 #Kakinada

మొక్కుబడిగా ముగిసిన అత్యవసర కౌన్సిల్ సమావేశం
ప్రజాశక్తి – సామర్లకోట : సామర్లకోట మున్సిపల్ కౌన్సిలర్ అత్యవసర సమావేశం కేవలం కోరం పైనే చర్చించి అజెండాపై ఎటువంటి చర్చ లేకుండా మొక్కుబడిగా ముగిసింది. సోమవారం ఉదయం 10:40 నిమిషాలకు మున్సిపల్ చైర్ పర్సన్ గంగిరెడ్డి అరుణ అధ్యక్షతన అత్యవసర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. చైర్ పర్సన్ అజెండా చదవాలని అనుమతించగా టిడిపి కౌన్సిలర్ బలుసు వాసు మాట్లాడుతూ కౌన్సిల్ కోరం సరిపోలేదని ఒకసారి లెక్కించాలని ఎజెండాకు అభ్యంతరం చెప్పారు. అయితే కౌన్సిల్ కు ఒకటి బై మూడు వంతు 11 మంది కంటే ఎక్కువ సభ్యులు ఉన్నారని అజెండా కొనసాగించవచ్చని వైసీపీ కౌన్సిలర్ ఆవాల లక్ష్మీనారాయణ సూచించారు. రెండు అంశాలు చదవగా మున్సిపల్ వైస్ చైర్మన్ ఊ బా జాన్ మోజెస్ మాట్లాడుతూ అజెండాలో 31 అంశం తప్పించి మొత్తం అంశాలన్నీ ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కారం పూర్తిగా లేదని అజెండా ఆమోదిస్తే అధికారులు ఇబ్బందులు పడతారని టిడిపి కౌన్సిలర్ బలుసు వాసు అభ్యంతరం తెలిపారు. అధికారులు మాట్లాడుతూ 16 మంది సభ్యులు హాజరయ్యారని కోరం సరిపోయిందని చెప్పారు. 11 మంది సభ్యులు ఉంటే సరిపోతుందని సీనియర్ వైసీపీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ తెలిపారు. సమావేశం ప్రారంభమైన పది నిమిషాల్లోనే అజెండాను ఆమోదిస్తున్నట్లు చైర్పర్సన్ ప్రకటించి సభను ముగించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జె రామారావు, కో ఆప్షన్ సభ్యులు మన్యం చందర్రావు, పలురు వైసిపి కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు.

➡️