ఖరీఫ్‌ సాగుకు నీరు అందేనా..?

Jun 16,2024 23:07
మెట్ట ప్రాంత జీవనాడిగా

ప్రజాశక్తి – ఏలేశ్వరం

మెట్ట ప్రాంత జీవనాడిగా ఉన్న ఏలేరు రిజర్వాయర్‌ ఎన్నడూ లేనివిధంగా నీటి నిల్వలు అడుగంటాయి. ఖరీఫ్‌లో పంట సాగుపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోదావరికి ముందస్తుగా వరదలు వచ్చి పుష్కర ఎత్తిపోతల పథకం నీటి లభ్యత ఉంటేనే ఏలేరు ఆయకట్టుకు సాగు నీరు అందే పరిస్థితి నెలకుంది. ఏలేరు ఆయకట్టు రైతులంతా నేడు పుష్కరపైనే ఆశలు పెట్టుకున్నారు. ఏలేరు రిజర్వాయర్‌ ఆయకట్టు జగ్గంపేట, ఏలేశ్వరం, ప్రత్తిపాడు, పెద్దాపురం, పిఠాపురం, గొల్లప్రోలు, యు కొత్తపల్లి మండలాల్లో 97 వేల ఎకరాలు ఉంది. అలాగే పంపా రిజర్వాయర్‌కి, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అవసరాలకు నీటిని అందించే విధంగా రిజర్వాయర్‌ను నిర్మించారు. రిజర్వాయర్‌ సామర్థ్యం 24.11 టిఎంసిలు (86 మీటర్లు). ప్రస్తుతం రిజర్వాయర్‌లో 3.57 టిఎంసిలు (68.51 మీటర్ల) నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. వాస్తవంగా డెడ్‌ స్టోరేజ్‌ 6.16 టిఎంసిలు. డెడ్‌ స్టోరేజీలో నీటి నిల్వ ఉంటే ఆయకట్టుకు నీటి విడుదల ఉండదు. అయితే ప్రస్తుత పరిస్థితిలో డెడ్‌ స్టోరేజీ సైతం సగానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో ఖరీఫ్‌ సాగుకు నీరు అందించే అవకాశం కన్పించడం లేదు. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అధికారులు పంపింగ్‌ ద్వారా రోజుకి 100 క్యూసెక్కులు నీటిని ఎడమ కాలువ ద్వారా తరలిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏలేరు రిజర్వాయర్‌ నీటిమట్టం తగ్గడంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయకట్టుకు 25 కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో పంట పొలాల్లో బోర్లు, పంచాయతీ మంచినీటి అవసరాలకు నీరు అందించే బోర్లు, గృహ ఆవసరాలకు బోర్లు నుంచి నీరు రావడం ఇబ్బందిగా మారింది. ఏలేరు రిజర్వాయర్‌ భవిష్యత్తు ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని 2017 సంవత్సరంలో అప్పటి ఎంఎల్‌ఎలు జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చిన్నరాజప్ప, ఎస్‌విఎస్‌ఎన్‌.వర్మ కృషితో చంద్రబాబు ప్రభుత్వం రూ.1630 కోట్ల వ్యయంతో గోదావరి జలాలను ఏలేరు రిజర్వాయర్‌కు తరలించేందుకు పురుషోత్తపట్నం వద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. ఈ పథకం ద్వారా ఆ రోజుకు 1200 క్యూసెక్కుల వంతున నెలకు నాలుగు టిఎంసీల నీరు ఏలేరు రిజర్వాయర్‌కు గోదావరి జలాలను తరలించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకోకపోవడంతో ఏలేరు రిజర్వాయర్‌ నీటిమట్టం తగ్గుతూ వచ్చింది. రెండు, మూడు ఏళ్లుగా పుష్కర ఎత్తిపోతల పథకం పట్ల వైసిపి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కొన్ని మోటార్లు పూర్తిగా పని చేయడం లేదు. వాటికి మరమ్మతులు చేపట్టాల్సివుంది. గోదావరి నుంచి జూన్‌, జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నాలుగు నెలల్లోనూ 16 టిఎంసిల నీరును ఏలేరు రిజర్వాయర్‌కు అందించేలా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రూపొందించబడింది. ప్రస్తుతం టిడిపి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో ఈ పథకాన్ని కొనసాగించి రిజర్వాయర్‌కు నీటిని తరలించి ఏలేరు ఆయకట్టును ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

➡️