భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రై డే

Mar 29,2024 16:24 #Kakinada

ఆకట్టుకున్న సిలువ యాత్ర ప్రదర్శన
ప్రజాశక్తి-సామర్లకోట : సర్వ మానవాళి పాప పరిహారార్థం యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టిన రోజుగా క్రైస్తవ ప్రజలు జరుపుకునే శుభ శుక్రవారం (గుడ్ ఫ్రై డే ) ప్రార్థనలు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు. సామర్లకోట పట్టణ మండల పరిధిలో సుమారు వందకు పైగా చర్చిల పరిధిలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకూ క్రైస్తవ ప్రజలంతా దేవాలయాల్లో చేరి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. యేసుక్రీస్తు సిలువ శ్రమలు, సిలువ వేసిన సన్నివేశాలను ఆర్ సీ ఎం చర్చి ఆధ్వర్యంలో ప్రత్యేక ర్యాలీగా నిర్వహించగా అవి ప్రజలను ఎంతగానో ఆకట్టు కున్నాయి. ఈ సిలువ యాత్రను వైసీపీ పెద్దాపురం నియోజక వర్గ ఇంచార్జి దవులూరి దొరబాబు ప్రారంభించారు. అలాగే అన్నిక్రైస్తవ దేవాలయాల్లో సంఘ కాపారులు, నాయకులు యేసుక్రీస్తు సిలువలో పలికిన ఏడు మాటలైన ” తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి”, “నేడు నీవు నాతోకూడా పరదైసులో ఉండువని నీతో నిచ్చయము గా చెప్పుచున్నాను “, అమ్మా ఇదిగో నీ కుమారుడు… ఇదిగో నీ తల్లి “, “ఏలీ ఏలీ లామా సభక్త “, “నేను దప్పిగొను చున్నాను “, “సమాప్తమాయేను”, “తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించు చున్నాను ” అనే మాటల సారాంసాన్ని వివరించారు. ఈ యాత్రలో యేసుక్రీస్తుగా చంద్రశేఖర్, పీలాతుగా వి రాజ్ కుమార్, బరాబ్బా, సతీష్, సైనికులుగా గంగాధర్, కృష్ణ, పండు, అభి, వేణు నవీన్, తేజలు నటించారు. ఫాదర్ ఎస్ పీటర్ ఆధ్వర్యంలో జరిగిన సిలువ యాత్రలో వైసీపీ పెద్దాపురం నియోజక వర్గ ఇంచార్జి దవులూరి దొరబాబు, వైసిపి రాష్ట్ర కార్మిక నాయకులు దవులూరి సుబ్బారావు, మున్సిపల్ చైర్ పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి, వైస్ చైర్మన్ ఊబా జాన్ మోసెస్ లు పాల్గొన్నారు. ఇంకా శుభ శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల్లో సంఘ కాపరులు, నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

➡️