పంచాయతీరాజ్‌ను నిర్వీర్యం చేశారు

Jul 1,2024 23:34
పంచాయతీరాజ్‌ శాఖను నిర్వీర్యం చేశారని

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, పిఠాపురం

గత వైసిపి ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్‌ శాఖను నిర్వీర్యం చేశారని డిప్యూటీ సిఎం పవన్‌కళ్యాణ్‌ అన్నారు. సోమవారం ఆయన పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత ఎన్‌టిఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీని ప్రారంభించారు. సాయంత్రం జనసైనికులు, వీరమహిళలతో సమావేశమయ్యారు. పింఛన్ల పంపిణీ అనంతరం నిర్వహించిన సభళో ఆయన మాట్లాడారు. తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల సమయంలో విమర్శలు, ప్రతివిమర్శలు చేశామని, ఇప్పుడు పాలనపైనే దృష్టి పెడతామన్నారు. పంచాయతీరాజ్‌ నిధులు ఏమయ్యాయో అంతుపట్టని విధంగా ఉందన్నారు. అప్పులు పేరుకుపోయాయన్నారు. తన వైపు నుంచి అవినీతికి తావుండదని, దీనికి తగినట్లుగా అధికారులు పని చేయాలన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉంటే రూ.600 కోట్లు ఖర్చుపెట్టి రుషికొండను తవ్వేసి మరీ రాజమహల్‌ కట్టారన్నారు. ఈ సొమ్ముతో ఓ జిల్లాను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయొచ్చన్నారు. కేంద్ర జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం నిధులను సైతం గత ప్రభుత్వం వినియోగించుకోలేక పోయింద న్నారు. ఫలితంగా గోదావరి చెంతనే ఉన్నా తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు. తమ ప్రభుత్వంలో అద్భుతాలు జరుగుతాయని చెప్పలేను గాని, ప్రభుత్వంలో ఏ జరుగుతుందో సామాన్యుడికి అర్థం అయ్యేలా పాలన ఉంటుంద న్నారు. జవాబుదారీ పాలన అందిస్తామన్నారు. పిఠాపురాన్ని ప్రపంచం చూసే స్థాయిలో అభివృద్ధి చేస్తానన్నారు. మొదటి మోడల్‌ గ్రామాన్ని ఈ నియోజకవర్గంలోనే తీర్చిదిద్దుతానన్నారు. వాలంటీర్లు లేకపోతే పనులు కావని చెప్పారని, అయితే నేడు వాలంటీర్లు లేకుండానే పింఛన్ల పంపిణీ జరిగిందన్నారు. ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ కాకినాడలో వరుస తనిఖీలు చేస్తున్నపుడు బయటపడుతున్న అక్రమ రేషన్‌ బియ్యం నిల్వలను ప్రజలు చూశారన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులకు బాధ్యులకు శిక్ష పడాలన్నారు. అనంతరం కలెక్టర్‌ షాన్‌ మోహన్‌ సగిలి మాట్లాడూతూ కాకినాడ జిల్లాలో 2,79,319 మంది లబ్దిదారులకు మొత్తం రూ.188 కోట్ల 39 లక్షల, 60 వేలను పింఛన్లుగా అందంచామన్నారు. ఈ సమావేశంలో కాకినాడ రూరల్‌ ఎంఎల్‌ఎ పంతం నానాజీ, ఎస్‌పి సతీష్‌ కుమార్‌, మాజీ ఎంఎల్‌ఎ వర్మ, డిఆర్‌డిఒ పీడీ కె.శ్రీరమణి, డిఎంహెచ్‌ఒ జె.నరసింహనాయక్‌, తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులకు కతజ్ఞతా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిఠాపురం ప్రజలు దేశ చరిత్రను తిప్పగలిగిన, లిఖించదగిన విజయం అందిచారన్నారు. కడ వరకు ప్రజల కోసమే పని చేస్తానని తెలిపారు. పంచాయతీరాజ్‌ శాఖలో లోపాలను సరిచేయాలంటే అధికారులు సహకరించాలన్నారు. శేషాచలం అడవుల్లో లభించే ఎర్రచందనం కొట్టివేసి ఆ దుంగలను వైసిపి హయాంలో దేశం దాటించి నేపాల్‌లో దొరికిపోయారన్నారు. ఆ ఫైల్‌ తన ముందుకు వచ్చిందన్నారు వైసిపిలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. 2019లో కాలం వైసిపికి 151 సీట్లు ఇచ్చి పరీక్ష పెట్టిందన్నారు. ఆ పరీక్షకు వారు తట్టుకోలేకపోయారన్నారు. అన్నింటికీ తాము అతీతులం అనేలా ప్రవర్తించారన్నారు. దీంతో కాలం పెట్టిన పరీక్షలో వారు ఓడిపోయారన్నారు. గనులు, ఇసుక, అడవులు ఇలా సహజ సంపదలన్నీ వైసిపి హయాంలో దోపిడికీ గురయ్యాయన్నారు. తనకు ప్రతి రోజూ ప్రతి గంటా కీలకమే అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఐదేళ్ల పాటు శక్తి వంచన లేకుండా పనిచేస్తానన్నారు. జనసేనకు వంద శాతం స్ట్రయికింగ్‌ రేట్‌ పార్టీగా పేరొచ్చిందన్నారు. కష్టపడే కార్యకర్తలను ప్రతి ఒక్కరినీ గుర్తించాలని సూచించానన్నారు. పిఠాపురం అభివద్ధి, అభ్యున్నతి కోసం నిరంతరం తాపత్రయపడతానన్నారు. ఆఖరి శ్వాస వరకు దాని కోసం పని చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి వేములపాటి అజరు కుమార్‌, పిఠాపురం నియోజకవర్గ సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

➡️