ఉద్రిక్తతల నడుమ పిఠాపురంలో పోలింగ్‌

May 13,2024 23:33
సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌

ప్రజాశక్తి – పిఠాపురం, యు.కొత్తపల్లి

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో పోలింగ్‌ ఉద్రిక్తల నడుమ ప్రశాంతంగా సాగింది. ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించేందుకు ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూ లైన్‌లో వేచి ఉన్నారు. పోలింగ్‌ మందకొడిగా సాగడంతో ఓటర్లు మండుటెండలో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురయింది. పలు కేంద్రాల వద్ద మంచినీరు టెంట్లు ఏర్పాటు చేసిన అవి సరిపోకపోవడంతో ఓటర్లు ఇబ్బం దులకు గురయ్యారు. ఓటు వేసేందుకు అధిక సమయం పట్టడంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. పోలింగ్‌ సమయం ముగిసిన పలు పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ కొనసాగుతూనే ఉంది.మండలంలోని విరవాడ గ్రామంలో జనసేన, వైసిపి, కార్యకర్తలు పోలింగ్‌ కేంద్రం వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడారు. వైసిపి కార్యకర్తలు కండువాలు కప్పుకుని పోలింగ్‌ కేంద్రం సమీపంలో ప్రచారం చేస్తున్నారంటూ జనసేన నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాదోపవాదాలు తోపులాటకు దారి తీశాయి. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. మండలంలో విరవ గ్రామంలో పోలింగ్‌ కేంద్రంలోకి వైసిపి అభ్యర్థి వంగా గీత వెళ్ళడానికి విలులేదంటూ జనసేన కార్య కర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పిఠాపురం మండలంలోని కుమారపురం గ్రామంలో వైసిపి నాయకులు దౌర్జన్యంగా తమ యొక్క ఓటు వేసే స్లిప్పులను పట్టుకుని పోయి, సంతకాలు పెట్టించు కున్నారని, వారు ఎక్కడ పోయారో తెలియట్లేదని గ్రామ స్తులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. విరవ గ్రామంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోని పోలింగ్‌ బూత్‌లో జనసేన పార్టీకి చెందిన 281 ఓట్లు తొలగించారని పార్టీ కార్యకర్తలు, ఓటర్లు అధికారులను నిలదీశారు. దీంతో అక్కడ చేరుకున్న తహశీల్ధార్‌ కె లక్ష్మి, డిఎస్‌పి కె.హనుమంతరావు వారితో చర్చించారు. ఓట్లు తొలగింపు దానిమీద సమగ్ర విచారణ చేపడతామని ఒకవేళ ఓట్లు తొలగించిన మాట వాస్తవం అయితే సంబంధిత అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. గొల్లప్రోలు పట్టణంలో జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల పోలింగ్‌ కేంద్రం వద్ద వైసిపి చెందిన కొంత మంది మహిళలు, కార్యకర్తలు జండాలతో ప్రచారం చేయడంతో ప్రచారాన్ని కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అక్కడ చేరుకున్న పోలీసులు ఇరువురిని చెదరగొట్టారు. యు.కొత్తపల్లి మండలంలో ప్రశాంతంగా ఓట్లు ప్రక్రియ జరిగింది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా కొన్ని గ్రామాలు తప్ప అన్ని గ్రామాలలో ఓటర్లు ఓట్లు వినియోగించుకున్నారు. నాగులపల్లి, ఉప్పాడ మినహా అన్ని గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణంలో ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగులపల్లిలో వైసిపి రాష్ట్ర నాయకులు వడిశెట్టి నారాయణరెడ్డి, టిడిపి, జనసేన నాయకులు మధ్య కొద్దిపాటి వాగ్వివాదం చోటుచేసుకుంది. అలాగే ఉప్పాడ జడ్‌పి హైస్కూల్‌లో మాజీ ఎంఎల్‌ఎ ఎస్‌విఎస్‌ఎన్‌.వర్మ రావడంతో వైసిపి, టిడిపి నాయకులు మధ్య చిన్నపాటి గొడవలు చోటు చేసుకున్నాయి. మండలంలో ప్రశాంతమైన ఓటింగ్‌ అధికారులు నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి పోలింగ్‌ సెంటర్లో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. ప్రతి బూతులో కొత్తపల్లి ఎస్‌ఐ స్వామినాయుడు పర్యవే క్షించి చర్యలు తీసుకున్నారు. ఓటు వేసేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తి చూపడంతో ఎండలు సైతం లెక్కచేయకుండా ఓటు వేసేందుకు లైన్‌లో ఓటర్లు క్యూలు కట్టారు. ఎన్నడులేని విధంగా ఈసారి ఎన్నికలకు ఓటింగ్‌ శాతం పెరిగిందని అధికారులు తెలుపుతున్నారు. తీర ప్రాంత గ్రామాల్లో అయితే వేకువ జాము నుంచి ఓటింగ్‌ వేసేందుకు అధిక స్థాయిలో మత్స్యకారులు క్యూ కట్టారు.

➡️