‘హరిధ్రా ఘటనం’తోశ్రీరాముని కల్యాణోత్సవం

ప్రారంభంప్రజాశక్తి-ఒంటిమిట్ట ఒంటిమిట్టలోని శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాలు శనివారం ‘హరిధ్రా ఘటనం’తో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది తొలిసారిగా టిటిడి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా మహిళా భక్తులు సుమారు మూడు కిలోల పసుపును పోసి జై శ్రీరామ్‌ నినాదాలు చేస్తూ సాంప్రదాయబద్దంగా రోలులో దంచారు. అంతకుముందు గర్భాలయం లోపల పసుపు కొమ్ములకు, రోకళ్లకు స్వామి పాదాల చెంత ప్రత్యేక పూజలను అర్చక స్వాములు సశాస్త్రీయంగా చేశారు. అర్చకులు శ్రవణ స్వామి మాట్లాడుతూ భగవత్‌ విజ్ఞాపనతో హరిధ్రా ఘటనం కార్యక్రమం ప్రారంభమైందని తెలిపారు. తద్వారా శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవ ఏర్పాట్లకు నాంది పలికినట్లు అయిందన్నారు. అనంతరం ఈ కార్యక్రమం యొక్క ప్రాధాన్యతను భక్తులకు తెలియజేశారు. పసుపు దంచే కార్యక్రమంలో వచ్చిన పసుపును ఉత్సవరులకు కల్యాణం నాడు నిర్వహించే స్నపనం, తలంబ్రాలు తయారీకి ఉపయోగిస్తారన్నారు. జై శ్రీరామ్‌ అంటూ నినదిస్తూ ఈ సాంప్రదాయ పసుపు దంచే కార్యక్రమంలో మహిళా భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అన్నమాచార్య కళాకారుల బందం సందర్భానుసారంగా రామ భజనలను కీర్తించారు. కార్యక్రమంలో ప్రధాన అర్చక స్వాములు రాఘవాచార్యులు, ఒంటిమిట్ట ప్రత్యేక అధికారి ప్రశాంతి, సూపరింటెండెంట్‌ హనుమంతయ్య, అర్చకులు మనోజ్‌, పవన్ల, ఆలయ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌, పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

➡️