అన్నదాతకు అందని పరిహారం

Feb 5,2024 22:44
అన్నదాతకు అందని పరిహారం

ప్రజాశక్తి- రాజోలు అన్నదాతకు అందని పరిహారం మాది రైతు కుటుంబం అన్నదాతలకు ఏ కష్టం వచ్చినా ముందుంటాం.. అంటూ ప్రతి సమావేశంలో మంత్రుల నుంచి ముఖ్యమంత్రి వరకు చెబుతుంటారు. అయితే క్షేత్ర స్థాయి పరిస్థితులు ఇందుకు భిన్నం. డిసెంబరులో వచ్చిన మిగ్‌జాం తుపాను ప్రభావంతో వరి సహా ఇతర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నెల రోజులు దాటినా రైతులకు నష్టపరిహారం అందలేదు. సంక్రాంతి ముందే పరిహారం ఇస్తామని చెప్పినా ఆ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు.  2023-24 ఖరీఫ్‌ సీజన్‌లో ఆది నుంచి రైతన్నలకు కష్టాలు తప్పలేదు. గత ఏడాది డిసెంబరు మొదటి వారంలో ముమ్మరంగా ఖరీఫ్‌ కోతలు జరుగుతున్న తరుణంలో మిగ్‌జాం తుపాను నట్టేట ముంచింది. గాలులు, భారీ వర్షం కారణంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలో 1.75 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ సాగు చేపట్టగా.. తుపాను దెబ్బకు వరి రాశులు తడిచిపోగా.. కోత దశలో ఉన్న వరిచేలు.. నేలకొరిగి.. కుళ్లిపోయాయి. బెండ, వంగ, ఆనబ, బొప్పాయి, అరటి, మిర్చి వంటి ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.ప్రతిపాదనలు పంపినా..పంటలను నష్ట పోయిన రైతులను గుర్తించి వారికి పరిహారం కోసం ప్రభుత్వానికి నివేదించే క్రమంలో ఆర్‌బికె సిబ్బంది, రెవెన్యూ, పంచాయతీ అధికారుల బృందం గ్రామాల్లో పర్యటించి అంచనాలు రూపొందించారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో 21,008 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. సామాజిక తనిఖీల అనంతరం 19,849 మంది రైతులకు రూ.17.85 కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా వేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలు, మామిడికుదురు, అమలాపురం, ఐ.పోలవరం, అంబాజీపేట, కొత్తపేట, అయినవిల్లి, ఆత్రేయపురం, ఆలమూరు, కె.గంగవరం, కపిలేశ్వరపురం, రావులపాలెం, ఆలమూరు, మలికిపురం, రామచంద్రపురం, మండపేట, అల్లవరం మండలాల్లోని 97 గ్రామాల్లో అరటి 459.540, కూరగాయలు 633.779, బొప్పాయి 29.824, పసుపు 0.660, పూలతోటలు 35.320, తమలపాకులు 3.720 వెరసి 1162.843 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లినట్లు లెక్క తేల్చారు. కాట్రేనికోన, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, కొత్తపేట మండలాల్లోని 22 గ్రామాల్లో 309 కొబ్బరిచెట్లుకు నష్టం వాటిల్లినట్లు లెక్క తేల్చి.. మొత్తంగా 3530 మంది రైతులకు రూ.2,39,69,411 పెట్టుబడి రాయితీ అందించాలని ప్రభుత్వానికి నివేదించారు. సంక్రాంతి నాటికి రైతులకు నష్ట పరిహారం అందిస్తామని ప్రకటించినా.. నేటికీ అతీగతీ లేదు.పరిహారం కోసం ఎదురు చుపులుఖరీఫ్‌ తుది దశలో వచ్చిన తుపాను అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నేల వాలగా, చేలల్లోని పనలు, కుప్పలు నీటిలో నాని కొన్నిచోట్ల ధాన్యం మొలకలొచ్చాయి. తుపాను వచ్చిన పదిహేను రోజుల తర్వాత పంట నష్టం అంచనాలకు వ్యవసాయ, రెవెన్యూ, పరిపాలన శాఖల నుంచి గ్రామ, మండల, డివిజన్‌ స్థాయి అధికారులతో ప్రభుత్వం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసింది. అప్పటికే వర్షాలకు తడిసిన ధాన్యం రాశులు, దెబ్బతిన్న వరి పంటను రైతులు ఒబ్బిడి చేసుకున్నారు. నేలనంటిన పంటను కోసి కొన్నిచోట్ల మాసూళ్లు పూర్తి చేశారు. కాగా, నిబంధనల పేరిట పూర్తిస్థాయిలో అంచనాలు నమోదు చేయలేదనే ఆరోపణలొచ్చాయి. పరిహారమైనా సకాలంలో అందితే రబీ పెట్టుబడికి పనికొస్తుందని రైతులు భావించారు. రాకపోవడంతో రబీకి అప్పులు చేసి పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. ఎన్నికల కోడ్‌ వచ్చే అవకాశం ఉండటం, రబీ ప్రారంభమై రోజులు దాటినా పరిహారం అందకపోవడంతో వస్తుందా రాదా అన్న ఆందోళన రైతుల్లో నెలకొంది.

➡️