ఆశా కార్యకర్తల నిర్బంధం దారుణం

Feb 7,2024 22:43
ఆశా కార్యకర్తల నిర్బంధం దారుణం

ప్రజాశక్తి-యంత్రాంగం తమ డిమాండ్ల సాధన కోసం ఆశా వర్కర్ల చలో విజయవాడ కార్యక్రమాన్ని బుధవారం పోలీసులు అడ్డుకోవడంతో ఆశా వర్కర్లు పలుచోట్ల పోలీసు స్టేషన్ల వద్దే నిరసన చేపట్టారు. రామచంద్రపురం కె.గంగవరం పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆశా వర్కర్లు నిరసన చేపట్టారు. ప్రభుత్వ నిర్బంధంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం విజయవాడకు తరలి వెళుతున్న ఆశా వర్కర్లను పోలీసులు అడ్డుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దీనతో వారంతా స్టేషన్‌ ముందు కూర్చుని నిరసన తెలిపారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకూ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులను ఖండించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూకల బలరాం పిలుపునిచ్చారు. న్యాయమైన డిమాండ్స్‌పై ఆశా వర్కర్లు చలో విజయవాడ కార్యక్రమానికి సిద్ధమవుతుండగా 6వ తేదీ నుంచి అరెస్ట్‌ లు చేయడం చాలా అన్యాయం అన్నారు. 6 తారీఖున నోటీసులు ఇచ్చారని.7న డ్యూటీలో ఉన్న ఆశాలను అరెస్ట్‌ చేసి స్టేషన్‌ తీసుకురావడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మండపేట ఆశా కార్యకర్తల గృహ నిర్బంధం, అరెస్టులు హేయమైన చర్యని సిఐటియు జిల్లా కార్యదర్శి కె.కృష్ణవేణి అన్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ఇప్పటికే పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చామన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల ఆరో తారీకు నుండి ఆశా కార్యకర్తలను పోలీసులు అరెస్టులు చేస్తున్నారన్నారు. అనారోగ్యంగా ఉన్న కార్యకర్తలను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి కూర్చోబెట్టడం, వాళ్లు రాకపోతే కుటుంబ సభ్యులు తీసుకెళ్లడం చేస్తున్నారని చెప్పారు. సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం ఈ విధానంలో వ్యవహరిస్తుండడం పద్ధతి కాదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా గృహనిర్బంధాలు, అక్రమ అరెస్టులు ఆపేయాలని డిమాండ్‌ చేశారు. కాట్రేనికోన నేడు చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఆశా కార్యకర్తలను గహనిర్బంధం, అక్రమ అరెస్టులు చేయడం వంటివి హేయమైన చర్యలని సిఐటియు జిల్లా కార్యదర్శి జి.దుర్గాప్రసాద్‌ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ఇప్పటికే పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చామన్నారు. ఇప్పటికైనా గృహనిర్బంధాలు, అక్రమ అరెస్టులు ఆపేయాలని, ఆశా కార్యకర్తల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని దుర్గాప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. అయినవిల్లి మండలంలోని వీరవల్లిపాలెం పిహెచ్‌సి సబ్‌ సెంటర్‌లో ఆశా వర్కర్ల సమావేశానికి ఎస్‌ఐ బి.రాజేష్‌ కుమార్‌ హాజరై వర్కర్లతో మాట్లాడారు. విజయవాడలో చలో అసెంబ్లీ కార్యక్రమానికి ప్రభుత్వ అనుమతి లేదని చెప్పారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పారు. అంబాజీపేట 50 మంది అశా వర్కర్లను పెదవీధి కళ్యాణ మండలంలో నిర్బందించడం హేయమైన చర్య అని జిల్లా ఆశా వర్కర్స్‌ నాయకురాలు ఎస్తేరు రాణి అన్నారు. అంబాజీపేట పెదవీధి కళ్యాణ మండపంలో ఈ నెల 6 తేదీ నుంచి వర్కర్లను పోలీసులు అరెస్టు చేసి నిర్బందిస్తున్నారన్నారు. ఈ నిర్బంధంలో మండల అధ్యక్షురాలు ఇ.మేరీ ప్రమీల, ఎన్‌.వరలక్ష్మి, పి.స్వరూపరాణి, సుజాత ఉన్నారు. ఉప్పలగుప్తం ఆశా కార్యకర్తలను పోలీసులు నిర్బంధించారు. అమలాపురం రూరల్‌ సిఐ, పి.వీరబాబు ఆధ్వర్యంలో స్థానిక ఎస్‌ఐ కెఎన్‌ జోషి, పోలీసు సిబ్బంది ఆశా కార్యకర్తలను అదుపులోకి తీసుకుని స్థానిక పోలిస్టేషన్‌లో నిర్బంధించి అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆలమూరు పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆశ వర్కర్ల నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం విజయవాడకు తరలి వెళుతున్న ఆశా వర్కర్లను పోలీసులు అడ్డుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కపిలేశ్వరపురం విజయవాడ వెళ్లకుండా ఆశా కార్యకర్తలను అదుపులోకి తీసుకొని అంగర పోలీస్‌ స్టేషన్లో నిర్బంధించారు. గ్రామాల్లో సేవలందించే ఆశా కార్యకర్తలను అంగర పోలీస్‌ స్టేషన్‌ లో ఉదయం నుంచి సాయంకాలం వరకు నిర్బంధించడంతో వారు ఆందోళన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం పోయింది . ప్రభుత్వం ఇలాంటి చర్యలను పాల్పడడం పట్ల ఆశా వర్కర్లు అసహనం వ్యక్తం చేశారు. 30 మంది ఆశా కార్యకర్తలపై కేసు నమోదు చేసి విడిచిపెట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.

➡️