గ్రామాభివృద్ధిని విస్మరించిన ‘వేదాంత’

Feb 2,2024 23:23

ఎస్‌.యానాం రవ్వ ప్లాంట్‌ వద్ద ఆందోళన చేస్తున్న గ్రామస్తులు

ప్రజాశక్తి-ఉప్పలగుప్తం

ఎస్‌.యానాంలో ఉన్న వేదాంత ఆయిల్‌ కంపెనీ గ్రామ అభివృద్ధిని విస్మరించి గ్రామ ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ శుక్రవారం నిరుద్యోగ యువత, గ్రామస్తులు మరోసారి ఆందోళన చేపట్టారు. ప్లాంటు గేటు వద్దకు వెళ్లే ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించి కార్మికులను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. 30 సంవత్సరాలుగా రూ.వేలకోట్లు తరలించుకుపోతూ అనేక రకాల కాలుష్యాన్ని విడుదల చేస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నారని గ్రామస్తులకు న్యాయం చేయాలంటూ గత ఏడాది డిసెంబర్‌ 11న ఒకసారి ఈ ఏడాది జనవరి 6న మరోసారి ఆందోళన చేపట్టామన్నారు. సమస్యలు పరిష్కరిస్తామని ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు హామీ ఇచ్చినప్పటికీ పరిష్కరించకపోవడంతో మరోమారు ఆందోళనకు దిగామని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామా భివద్ధికి విడుదల చేస్తున్న సి ఎస్‌ ఆర్‌ నిధులను వేరే ప్రాంతాలకు బదలాయిస్తూ గ్రామానికి అన్యాయం చేస్తున్నారని కాలుష్యం వలన కనీసం రక్షిత త్రాగునీరు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో అనేకమందికి ఇప్పటికీ గ్రామస్తులు అంతు పట్టని రోగాల బారిన పడుతున్నారని ఎన్నిసార్లు ఆందోళనలు చేపడుతున్నా వేదాంత కంపెనీ కనీసం స్పందించడం లేదన్నారు. గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించే బాధ్యత మరచి ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అధికారులు చ్చేంత వరకు ఆందోళనను విరమించేది లేదన్నారు. డిప్యూటీ తహశీల్దార్‌ సుబ్రహ్మణ్యం, ఆర్‌ఐ ఎంవి.రమణ, ఎస్‌ఐ కెఎం.జోషి ఆందోళనకారులకు నచ్చజెప్పినా ఆందోళన విరమించలేదు. ఆందోళనకారుల వద్దకు జెడ్‌పిటిసి సభ్యుడు గెడ్డం సంపదరావు వచ్చి చర్చలు జరిపారు.ఈనెల 13న సమస్య పరిష్కారానికి చర్చలు జరిపేందుకు అమలాపురం డిఎస్‌పి ఇచ్చిన హామీ పత్రాన్ని దళిత నేత ఇసుకపట్ల రఘుబాబు ఆందోళన కారుల వద్దకు తీసుకువచ్చి వివరించారు. దీనికి కూడా ఆందోళనకారులు ససిమేర అన్నారు.రాత్ర యినా ఆందోళనను కొనసాగించారు. గ్రామానికి చెందిన ఎంపిటిసి సభ్యులు పెట్టా అప్పారావు, గ్రామ పెద్దలు జోగి రాజా, అయితాబత్తుల సూరిబాబు, బడుగు అబ్బులు,ఉలిశెట్టి దొరబాబు, పలచోళ్ళ పద్మనాభం, పెట్టా మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

 

➡️