పోలింగ్‌ నిర్వహణపై సిబ్బందికి అవగాహన

Mar 4,2024 23:06
పోలింగ్‌ నిర్వహణపై సిబ్బందికి అవగాహన

ప్రజాశక్తి-అమలాపురం భారత ఎన్నికల సంఘం నిబంధనలను పక్కాగా ఆచరిస్తూ ఎన్నికల సిబ్బందికి ఇచ్చే తపాలా బ్యాలెట్లు దుర్వినియోగం కాకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని గోదావరి భవన్‌ నందు త్వరలో నిర్వహించనున్న పార్లమెంట్‌ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలలో తపాలా బ్యాలెట్‌ పోలింగ్‌ ప్రక్రియ నిర్వహణపై ఎన్నికల సిబ్బందికి అవగాహన కార్యక్ర మం నిర్వహించారు. తపాలా బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకునే వారు ఫారం-13 ఎ ఓటరు ధ్రువీకరణ పత్రం పూర్తిగా వివరాలతో నింపి సంతకం చేసి గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరణ చేయించి డిక్లరేషన్‌ ఇవ్వాలని సూచించారు. ఫారం 13 బి కవరు లోపలి తపాలా బ్యాలెట్‌ మాత్రమే పెట్టాలని బ్యాలెట్‌ పేపర్‌పై, టిక్కు లేదా క్రాస్‌ మార్క్‌ ఓటింగ్‌ మాత్రమే చేయాలని బ్యాలెట్‌ పేపర్‌ వెనుక భాగంలో ఆర్‌ఒ సంతకం స్టాంప్‌ సహా ఉండాలని ఆ యొక్క కవర్‌పై బ్యాలెట్‌ పేపర్‌ సీరియల్‌ నెంబర్లు తప్పని సరిగా నమోదు చేయాలన్నారు. పారం 13సి – కవరు బిలో 13 బి తపాలా బ్యాలెట్‌ 13 ఏ డిక్లరేషన్‌ విడివిడిగా కవర్లో పెట్టి సీల్‌ చేయాలన్నారు. కవర్‌పై సంతకం చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగి డిక్లేరేషన్‌లో సంతకం లేకపోవడం డిక్లేరేషన్‌లో బ్యాలెట్‌ పేపర్‌ సీరియల్‌ నంబర్‌ రాయక పోవడం గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరణ లేకపోవడం, ఓటేసిన తపాలా బ్యాలెట్‌ను 13 బి కవరులో పెట్టకపోవడం, సీలు వేయక పోవడం, తపాలా బ్యాలెట్‌, డిక్లరేషన్‌ కలిపి ఒకే కవరులో పెట్టడం. బ్యాలెట్లో ఓటర్‌ సంతకం చేయడం, ఓటు రహస్యతను కాపాడకపోవడం వల్ల ఆ యొక్క తపాలా బ్యాలెట్లు తిరస్కరించే అవకాశం ఉందన్నారు. తపాలా బ్యాలెట్లు దుర్వినియోగం కాక తపాలా బ్యాలెట్లను సిబ్బంది విధులు నిర్వహించే ప్రాంతాల సమీపంలోని ప్రత్యేక కేంద్రాల్లో సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి తపాలా బ్యాలెట్లు ఇవ్వడం జరుగుతుందని ఎన్నికల సిబ్బందికి ఇచ్చే తపాలా బ్యాలెట్లు దుర్వినియోగం కాకుండా చూసేందుకు ఎన్నికల కమిషన్‌ సిఫార్సు మేరకు ప్రభుత్వం ఇటీవల నిబంధనల్ని మార్చిందన్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బందికి, సర్వీస్‌ ఓటర్లు అనగా ఆర్మీ జవాన్లు, వికలాంగులు, 85 సంవత్సరాలు వయసు పైబడిన వారు తపాలా బ్యాలెట్‌ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అర్హులని ఆయన స్పష్టం చేశారు. తపాలా బ్యాలెట్‌ ఓటు హక్కును నిబంధన మేరకు సిబ్బందికి వర్తింపజేయాలని ఆయన సూచించారు. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. 12 ఎ ద్వారా తపాలా బ్యాలట్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తపాలా బ్యాలెట్‌ నిర్వహణ ప్రక్రియను పూర్తిగా వీడియోగ్రఫీ ద్వారా చిత్రీకరించాలన్నారు. పోలింగ్‌ ఏజెంట్ల సమక్షంలోనే తపాలా బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియలు నిర్వహించాలన్నారు. తపాలా బ్యాలెట్‌ ఓటింగ్‌ విధానంపై సిపిఒ ఎన్నికల సిబ్బందికి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన పెంపొందించారు. ప్రయోగాత్మకంగా తపాలా బ్యాలెట్‌ ఓటు హక్కు వినియోగంపై రహస్య పోలింగ్‌ ప్రక్రియను సిబ్బందితో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.నుపూర్‌ అజరు, డిఆర్‌ఒ ఎం.వెంకటేశ్వర్లు, ఏడు నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు కలెక్టరేట్‌ ఎఒ సిహెచ్‌.వీరాంజనేయప్రసాద్‌ కో ఆర్డినేషన్‌ అధికారి టి.వైద్యనాథ్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.

➡️