రసాభాసగా మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం

Jan 29,2024 22:14
రసాభాసగా మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం

ప్రజాశక్తి-ముమ్మిడివరంఅభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా తాము పని చేస్తున్నామని, నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ప్రతిపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ నగర పంచాయతీ చైర్మన్‌ కమిడి ప్రవీణ్‌ కుమార్‌ కౌన్సిల్‌ నుంచి వాకౌట్‌ చేశారు. సోమవారం చైర్మన్‌ ప్రవీణ్‌ కుమార్‌ అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. తొలుత 17 అంశాలతో కూడిన అజెండాను, 8 అంశాలతో కూడిన టేబుల్‌ అజెండాను ప్రవేశపెట్టి చర్చించారు. 11వ అంశంలో పేర్కొన్న రూ.15 లక్షలతో చేపట్టిన గ్రావెల్‌ పనుల్లో నాసిరకం మెటీరియల్‌ పెట్టీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాకే బిల్లును ఆమోదించాలని ప్రతిపక్ష ఫ్లోర్‌ లీడర్‌ బాలకృష్ణ పట్టుబట్టారు. దీనిపై చైర్మన్‌ ప్రవీణ్‌ కుమార్‌ కల్పించుకుని అభివృద్ధి చేస్తుంటే ఓర్వ లేక ప్రతిపక్ష కౌన్సిల్‌ సభ్యులు నిరాధారమైన ఆరోపణలతో అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. దీనిపై ప్రతిపక్ష కౌన్సిల్‌ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నాసిరకం మెటీరియల్‌పై సంబంధిత ఎఇ, కమిషనర్‌ వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు. వీరి అభ్యంతరాలను ఖాతరు చేయకుండా చైర్మన్‌ సమావేశాన్ని కొనసాగించాలని ఆదేశించడంతో, ప్రతిపక్ష కౌన్సిల్‌ సభ్యులు వివరణ ఇవ్వకపోతే వాకౌట్‌ చేస్తామని హెచ్చరిస్తూ, చైర్మన్‌ పోడియం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. 17వ వార్డు కౌన్సిలర్‌ బొంతు సత్య శ్రీనివాస్‌ కల్పించుకుని ప్రజల అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని బాక్స్‌ టెండర్‌లు పిలిచి త్వరితగతిన పనులు పూర్తి చేస్తున్నామని సమాధానమిచ్చినప్పటికీ ప్రతిపక్ష కౌన్సిల్‌ సభ్యులు సంతప్తి చెంద లేదు. విచారణ అనంతరమే బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించాలని పట్టుబట్టారు. ప్రతిపక్ష కౌన్సిల్‌ సభ్యులు శాంతించక పోవడంతో చైర్మన్‌ ప్రవీణ్‌ కుమార్‌ అధ్యక్ష స్థానం నుంచి వెళ్లిపోయారు. ఈ సమావేశంలో నగర పంచాయతీ కమిషనర్‌ జి.లోవ రాజు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️