డెంగీ నిర్మూలనపై అవగాహనా ర్యాలీలు

Jul 2,2024 22:31

అంబాజీపేట పిహెచ్‌సి ఆధ్వర్యంలో డెంగీ మాసోత్సవ ర్యాలీ

ప్రజాశక్తి-యంత్రాంగం

జిల్లాలో పలు చోట్ల డెంగీ నిర్మూలనపై మంగళవారం అవగాహనా ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్బంగా వైద్య సిబ్బంది డెంగీ నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అంబాజీపేట: ఇంటి పరిసరాలలో మురికి నీరు నిల్వలు లేకుండా పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకుంటే డెంగీను నిర్మూలించవచ్చునని అంబాజీపేట పిహెచ్‌సి వైద్యాధికారి కెఎస్‌.శ్రీనివాస్‌ అన్నారు. డెంగీ వ్యతిరేక మాసోత్సవం సందర్భంగా మంగళవారం అంబాజీపేట పిహెచ్‌సి వద్ద డాక్టర్‌ కెఎన్‌.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్‌ డబ్బాలు, రుబ్బిరోలు, టైర్లు, కొబ్బరి చిప్పలు, తాగి పడేసిన బొండాలను నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. కూలర్స్‌లో నీటిని, ఫ్రిడ్జ్‌ లలో వధా నీటి నిల్వలను లేకుండా చూడాలన్నారు. ఈ ర్యాలీలో ఎస్‌డబ్ల్యూఒ ఎన్‌వి.రమణారావు, సిహెచ్‌ఒ బి.అప్పారావు, పిహెచ్‌సి సిబ్బంది, కిమ్స్‌ కళాశాల సిబ్బంది, పాల్గొన్నారు. ముమ్మిడివరం: డెంగీ వ్యాధి పట్ల ప్రజలంతా అవగాహన కలిగి ఉండాలని ముమ్మిడివరం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి యోగితా లక్ష్మీ అన్నారు. నగర పంచాయతీ పరిధిలోని స్థానిక పోలమ్మ చెరువు వద్ద గల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మంగళవారం వైద్య సిబ్బంది అద్వర్యం లో ఏర్పాటు చేసిన డెంగీ మాసోత్సవ ర్యాలీని వైద్యాధికారి యోగితా లక్ష్మీ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో జూనియర్‌ వైద్యులు, సూపర్‌ వైజర్‌ బి.సంపూర్ణ, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు మరియు యుపిహెచ్‌ సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

➡️