ఎన్నికల కాలం.. ఓటర్లకు గాలం..

Apr 15,2024 22:23
ఎన్నికల కాలం.. ఓటర్లకు గాలం..

ప్రజాశక్తి- రాజోలు, రామచంద్రపురంమునుపటి ఎన్నికల మాదిరిగా ఇప్పుడు కార్యకర్తలు, అభిమానులు.. నేతల వెంట వచ్చే పరిస్థితి లేదు. పోలింగ్‌కు కొద్ది రోజుల ముందే ప్రధాన పండుగలు, పర్వదినాలు, వ్యవసాయ సీజన్లు రావడంతో అన్నివర్గాల వారూ ఎవరి పనుల్లో వారు నిమగమవుతున్నారు. దీంతో అభ్యర్థులు, నాయకులు తమ వెంట అనుచరులతో పాటు ఉత్సాహవంతులైన యువతను వెంట బెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో మాదిరిగా గ్రామాలు, పట్టణాల్లోని యువకులు స్వచ్ఛందంగా పార్టీల కార్యక్రమాల్లో ఉత్సాహంగా కనిపించడం లేదు. ఈ లోటును భర్తీ చేసుకునేందుకు, యువత సైతం తమ వెంటే ఉందని ప్రత్యర్థులకు చాటాలనే ప్రయత్నంలో కొందరు విద్యార్థులకు గాలం వేస్తున్నారు. కొద్ది రోజులుగా డిగ్రీ, బి.టెక్‌, తత్సమాన కోర్సులు అభ్యసిస్తున్న వారు, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న నిరుద్యోగులను ప్రచారాలకు తీసుకెళ్లే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ‘ఈ నాలుగు రోజులు ప్రచారం జరిగే వరకు మీ అబ్బాయిని తీసుకెళ్తాం. పెట్రోలు, భోజనం ఖర్చులతో పాటు రోజుకు కొంత మొత్తం ఇప్పిస్తాం. ఆ డబ్బులు చదువుకైనా ఉపయోగపడతాయి. మందు, విందులు వంటివి ఎట్టి పరిస్థితుల్లో ఉండవు’ అని స్థానిక నాయకులు యువత తల్లిదండ్రులకు నచ్చచెబుతున్నారు. వారి పిల్లలను పార్టీ కార్యక్రమాలకు తమ వెంట తీసుకెళ్తున్నారు.చేతి ఖర్చుల కోసం…!ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రధాన పార్టీల అభ్యర్థులు బైకు ర్యాలీలు, ప్రదర్శనలు, సమావేశాలు నిర్వహిస్తే నాయకులు తగిన సంఖ్యలో తమ ర్యాలీలు, ప్రచారాలకు తీసుకెళుతున్నారు. గంట నుంచి రెండు గంటల్లోపు కార్యక్రమాలకైతే పెట్రోలుకు రూ.100, చేతి ఖర్చులకు రూ.200 వరకు ఇస్తున్నారు. ఒకవేళ రోజంతా వెళ్లాల్సి వస్తే పెట్రోలు ధర రెట్టింపు చెల్లించడంతో రూ.300 వరకు నగదు ఇస్తున్నారు. మధ్యాహ్నం వేళ రూ.200 వరకు ఖర్చుచేసి భోజనం లేదా బిర్యానీ పెట్టిస్తున్నారు. పగలు ప్రచారం.. రాత్రి వ్యూహం..అభ్యర్థుల్లో కొందరు సాయంత్రం వరకు కార్యకర్తలతో వార్డులు, గ్రామాల్లో పార్టీ జెండాలతో ప్రచారం చేయిస్తూ రాత్రి వేళ తమ వ్యూహం అమలు చేస్తున్నారు. ఇప్పటికే పలు పార్టీల ముఖ్య నేతలు, సీనియర్‌ నాయకులు, ప్రజాప్రతినిధులను తమ వైపునకు తిప్పుకున్నారు. కుల సంఘాలు, ఉద్యోగులు, వివిధ వర్గాలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మద్దతు కోరుతున్నారు. విజయమే లక్ష్యంగా అభ్యర్థులు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కంటిపై కునుకు లేకుండా మంతనాలు జరుపుతున్నారు. వ్యవహారం బయటకు పొక్క కుండా ఉండేందుకు ఆయా నియోజకవర్గాల్లో కాక బయట తోటలు, వేర్వేరు ప్రాంతాల్లో సమావేశాలు సైతం నిర్వహిస్తున్నారు.మండుటెండ లోను ప్రచారాలురామచంద్రపురం సార్వత్రిక ఎన్నికల సమీపిస్తుండటంతో సోమవారం నుండి ఒక్కసారిగా ఎన్నికల వేడి పెరిగింది. దీంతో వైసిపి తెలుగుదేశం పార్టీలు హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. మధ్యాహ్నం సమయంలో విపరీతమైన ఎండలను సైతం లెక్కచేయక నాయకులు ప్రచారం చేస్తున్నారు. దీంతో నాయకులు వెంట కార్యకర్తలు ఆయా పార్టీల అభిమానులు వేసవికాలం ఎండలను లెక్కచేయక తిరుగుతున్నారు.వైసిపి అభ్యర్థి పిల్లి సూర్య ప్రకాష్‌ సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేగాయమ్మపేటలో ప్రచారం నిర్వ హించారు. తెలుగు దేశం పార్టీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్‌ ద్రాక్షా రామ మెయిన్‌ రోడ్‌లో, బియ్యం పేటలోను సోమవారం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. మధ్యా హ్నం 12 గంటల నుండి రెండు గంటల వరకు ఎండ తీవ్రతను నాయకులు ప్రచారం కొన సాగించారు. ఎన్నికల వేడి ఊపందుకోవడంతో పార్టీ నాయకులు కార్యకర్తలు ఎండలను సైతం లెక్కచేయకుండా చల్లగా ఉన్నట్లుగా ప్రసారాలు కొనసాగిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు.అంతుచిక్కని ఓటరు నాడిఎన్నికలు సమీపిస్తుండటంతో ఆయా పార్టీల నాయకులు ఓటర్ల కోసం రాత్రీ పగలూ తేడా లేకుండా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఓటర్లను పలకరిస్తూ తమ పార్టీకి మద్దతు ఇచ్చిన వారికి పార్టీ కండువాలు కప్పుతూ ముందుకు సాగుతున్నారు. ఇదే నేపథ్యంలో గ్రామాల్లోని ఓటర్లు అంతా ఏ నాయకులు వచ్చినా కాదనకుండా నాయకులతో చిరునవ్వుతో పలకరిస్తూ వారు వేసే పార్టీ కండువాలు కప్పుకుంటున్నారు. విచిత్రం ఏమిటంటే గ్రామాల్లో ఏ నాయకుడు వచ్చినా ఏ పార్టీ వారైనా ఓటరు వారిని సాదరంగా ఆహ్వానిస్తూ కాదనకుండా ఆ పార్టీ కండువాలు కప్పు కుంటున్నారు. దీంతో గ్రామాల్లోని ఓటర్లు ఎవరు వైపు మొగ్గు చూపుతున్నారనేది అంతుచిక్కని ప్రశ్నగా ఉంది. నాయకుల ముఖస్తుతి కోసం వారి ముందు వినయంగా మీకే మా ఓట్లంటూ ప్రకటించినప్పటికీ ఆ తర్వాత వచ్చిన నాయకులు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారనేది అంతు చక్కని ప్రశ్నగా తయారైంది. దీంతో గ్రామాల్లో పర్యటిస్తున్న నాయకులకు అయోమయంగా ఉంది. మరోవైపు గ్రామాల్లో పర్యటించినప్పుడు నాయకులు ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీ ఇస్తున్నారు. అయినప్పటికీ ఓటర్లు అంతా అందరితోనూ ముచ్చటించటం మీకే మా మద్దతు అంటూ చెప్పడంతో అసలు వారు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనేది అంచనా వేయలేకపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీల్లో వేడి వాతావరణం నెలకొవడమే కాక పార్టీ శిబిరాల వద్ద జన సందోహం పెరుగుతోంది.

➡️