విజయవాడ అభివృద్ధికి బాబూరావును గెలిపించాలి

Apr 20,2024 23:10
  • 32వ డివిజన్‌ పర్యటనలో సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ నేతలు

ప్రజాశక్తి-విజయవాడ

నిర్లక్ష్యానికి గురైన విజయవాడ నగరం అభివృద్ధికి ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం అభ్యర్థి సిహెచ్‌.బాబురావుకు ఓటు వేసి గెలిపించాలని పలువురు నాయకులు కోరారు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలోని 32వ డివిజన్‌ లోటస్‌ ల్యాండ్‌ మార్క్‌, అయోధ్య నగర్‌ ప్రాంతంలో సిహెచ్‌.బాబురావుతో పాటు కాంగ్రెస్‌ రాష్ట్ర నేత, ప్రముఖ న్యాయవాది వి.గురునాధం, సిపిఐ నగర నాయకులు కెవి భాస్కరరావు, సిపిఎం సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శి బి.రమణారావు తదితరులు శనివారం పర్యటించి ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా బాబూరావు, గురునాధం, భాస్కర్‌రావు మాట్లాడుతూ సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై జరిగిన గులకరాయి దాడి చుట్టూతే వైసిపి, టిడిపి తిరుగుతున్నాయని, ప్రజా సమస్యల ఎజెండాను ఆ పార్టీలు గాలికి వదిలేశాయని విమర్శించారు. ఒకరిపై మరొకరు పరస్పర దూషణలు, దాడులతో వివాదాలు రెచ్చగొడుతున్నారన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం, సానుభూతి కోసం ఈ పార్టీలు పేదలను, సామాన్యులను బలి చేస్తున్నాయన్నారు. మద్యం ఏరులై పారిస్తూ యువతను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. పరస్పర విమర్శలతో వాస్తవాలు మరుగున పడుతున్నాయని అన్నారు. దాడి, అరెస్టుల పేరుతో సానుభూతి పొంది ఓట్లు దండుకోవటానికి నేతలు ప్రయత్నించటం సిగ్గుచేటన్నారు. సరైన విచారణ జరగాలి, నిజమైన దోషులను శిక్షించాలి, అమాయకులపై వేధింపులు ఆగాలని డిమాండ్‌ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం పేదలను బలిచేసే నేతలకు, పార్టీలకు ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నగరంలో ప్రశాంత వాతావరణాన్ని పరిరక్షించడానికి సిపిఎం, కమ్యూనిస్టులకు మద్దతునివ్వాలని కోరారు. విజయవాడ సెంట్రల్‌లో సిపిఎంకు ఓటు వేయాలని కోరారు. గతంలోనూ, నేడు ప్రజాప్రతినిధులుగా ఉంటూ వైసీపీ, టిడిపి నేతలు వివాదాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు. అధికార దుర్వినియోగానికి, భూ కబ్జాలకు పాల్పడుతున్నారని అన్నారు. వ్యక్తిగత దూషణలతో ప్రజా ప్రతినిధుల స్థాయిని దిగజార్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు వసూలు చేయడం తప్ప అభివృద్ధిని విస్మరించాయని పేర్కొన్నారు. పన్నుల భారాలతో సామాన్యులతో పాటు మధ్యతరగతి ప్రజలు కుంగిపోతున్నారని, వేధింపులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ పాలకపక్షంగా ఉన్న నేతలు అవినీతికి పాల్పడుతూ ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని అన్నారు. ప్రజల ఓట్లతో గద్దెనెక్కి అధికార దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. సిపిఎం బాబురావు ప్రజా సేవకు అంకితమై దశాబ్దాలుగా పని చేస్తున్నారని, పాలకులు 73 అక్రమ కేసులు మోపినా నిర్బంధాన్ని ఎదుర్కొంటూ ప్రజా ఉద్యమాల్లో ముందు పీఠిన నిలబడుతున్నారని అన్నారు. ఇటువంటి నేతను నగరం నుండి శాసనసభకు పంపి ప్రజల వాణిని అసెంబ్లీలో వినిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ నేతలు బోయి సత్యబాబు, డీబీకే రావు, సీతారామ రావమ్మ, సుందర రామరాజు, ప్రభుదాసు, రాజు, పద్మ తదితరులు పాల్గొన్నారు.

➡️