ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి

Dec 18,2023 19:41

హంద్రీలో ఇసుక అక్రమ తవ్వకాల వద్ద బైఠాయించిన జనసేన నాయకులు

– జనసేన ఇన్‌ఛార్జీ రేఖాగౌడ్‌
– హెచ్‌.కైరవాడి హంద్రీ నదిలో అక్రమ తవ్వకాలు చేపట్టిన ప్రదేశాల్లో జనసేన సందర్శన
ప్రజాశక్తి – గోనెగండ్ల
ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జీ రేఖాగౌడ్‌ తెలిపారు. సోమవారం మండలంలోని హెచ్‌.కైరవాడి హంద్రీ పరివాహక ప్రాంతంలో అడ్డగోలుగా భూములను తవ్వి ఇసుక రవాణా చేపడుతున్న ప్రాంతాన్ని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇసుక అక్రమ తవ్వకాలు అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో యథేచ్ఛగా నిర్వహిస్తున్నారని, నియంత్రించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. పేదల ఇంటి నిర్మాణ అవసరాలకు రూ.వేలు ఖర్చు పెట్టినా సమయానికి ఇసుక అందడం లేదని తెలిపారు. కొంతమంది నాయకులకు మాత్రం స్టాక్‌ పాయింట్లు పెట్టుకునేంత దొరకడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. హంద్రీ పరిసర ప్రాంతాలైనా గంజహల్లి, హెచ్‌.కైరవాడి, అగ్రహారం గ్రామాల్లో రాత్రి వేళల్లో అడ్డగోలుగా ఇసుకను రవాణా చేస్తున్నా చర్యలు తీసుకోవడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. హంద్రీ ప్రాంతంలో ఇసుక రవాణా చేసేందుకు ప్రభుత్వ అనుమతి ప్రకారం రీచ్‌ ఏర్పాటు చేయలేదని, కానీ కొంతమంది దళారులకు మాత్రం రీచ్‌ అడ్డాగా మారిందని తెలిపారు. అధికారులు చొరవ తీసుకుని ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే జనసేన పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లి ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జనసేన నాయకులు గానిగ బాషా, కరణం రవి, ఎల్లప్ప, ఖాసీం సాహెబ్‌, మాలిక్‌, దూద్‌ పీరా, నరసింహులు, భాస్కర్‌, మునిస్వామి, సుభాన్‌, వినోద్‌, మాబాష, మల్లి, వెంకటేష్‌, మునాఫ్‌, ఆదామ్‌, ఇబ్రహీం పాల్గొన్నారు.

➡️