మాట తప్పిన ప్రభుత్వం

Dec 18,2023 19:40

ఆలూరులో చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలుపుతున్న అంగన్వాడీలు

– చెవిలో పూలు పెట్టుకుని అంగన్వాడీల నిరసన
ప్రజాశక్తి-ఆలూరు
అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం మాట తప్పిందని ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ తాలూకా కార్యదర్శి జయశ్రీ, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కెపి.నారాయణ స్వామి విమర్శించారు. సమస్యలను పరిష్కరించాలని సోమవారం 6వ రోజు సమ్మె చేపట్టారు. సమ్మెలో భాగంగా అంగన్వాడీలు చెవిలో పూలు పెట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణలో కంటే ఎక్కువ వేతనాలు ఇస్తామని, ఉద్యోగ భద్రత, అర్హులకు ప్రమోషన్లు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, పింఛను సౌకర్యం కల్పిస్తానని అధికారంలోకి రాకముందు జగన్మోహన్‌ రెడ్డి మాట ఇచ్చి మరిచారని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్‌ అంగన్వాడీలో చేర్చాలని, వర్కర్లకు, హెల్పర్లకు ప్రమోషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఐసిడిఎస్‌ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని కోరారు. అంగన్వాడీల సమ్మెకు వాల్మీకి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతి నాయుడు, జిల్లా అధ్యక్షులు అర్జున్‌, విఆర్‌పిఎస్‌ జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు, నాయకులు సురేంద్ర, లక్ష్మణ్‌, గోవిందు, తిమ్మప్ప, ఎస్‌టియు నాయకులు బి.నాగరాజు, అశ్విని కుమార్‌, రమేష్‌, సూర్యనారాయణ మద్దతు తెలిపారు. సిఐటియు తాలూకా నాయకులు కృష్ణ, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు భారతి, లీలావతమ్మ, సరోజమ్మ, బాలరంగమ్మ, లక్ష్మీ, సరస్వతి, సుజాత, ప్రభావతి, పుష్పవతి, వెంకటలక్ష్మి పాల్గొన్నారు. ఆదోనిలోని అంబేద్కర్‌ విగ్రహం ముందు వరలక్ష్మి, జానకి అధ్యక్షతన అంగన్వాడీల సమ్మె ఏడో రోజుకు చేరుకుంది. అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వెంకటమ్మ, సిఐటియు అధ్యక్ష, కార్యదర్శులు తిప్పన్న, గోపాల్‌, ఎఐటియుసి పట్టణ నాయకులు టి.వీరేష్‌, అంగన్వాడీ వర్కర్లు పద్మ, రేణుక, సరోజ, వీరమ్మ, మీనా కుమారి, రిజ్వానా, అంగన్వాడీ యూనియన్‌ (ఎఐటియుసి) నాయకులు జానకి, శారద, ఈరమ్మ పాల్గొన్నారు. మంత్రాలయం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఉన్న ప్రాజెక్టు కార్యాలయం నుంచి పాత ఊరులోని ఎస్‌ఎస్‌ ట్యాంకు వరకు ర్యాలీ నిర్వహించారు. సిఐటియు మండల కార్యదర్శి హెచ్‌.జయరాజు, అంగన్వాడీ ప్రాజెక్టు అధ్యక్షులు విశాలాక్షి ఆధ్వర్యంలో ట్యాంకు ఎక్కి నిరసన చేపట్టారు. అంగన్వాడీలు ఉమామహేశ్వరి, భీమేశ్వరి, లావణ్య, ఫాతిమా, ద్రాక్షాయని పాల్గొన్నారు. కోసిగిలో బస్టాండ్‌ నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన చేపట్టారు. సిఐటియు మండల కార్యదర్శి రాముడు, రైతు సంఘం మండల కార్యదర్శి వీరేష్‌, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు హెబ్సిబా రాణి, లుసమ్మ మాట్లాడారు. సమ్మెకు టిడిపి మండల కన్వీనర్‌ జ్ఞానేష్‌ మద్దతు తెలిపారు. టిడిపి నాయకులు వక్రాని వెంకటేశులు, నాడిగేని అయ్యన్న, భరద్వాజ శెట్టి, వీరారెడ్డి, మహాదేవ, రాజు, ఉమర్‌ సాబ్‌ పాల్గొన్నారు. కౌతాళం మండలంలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 7వ రోజుకు చేరింది. ఎంఇఒ కార్యాలయం ముందు ధర్నా చేపట్టి, ఎంఇఒకు సమస్యలను వివరించారు. అనంతరం తహశీల్దార్‌ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి ధర్నా చేపట్టారు. రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.మల్లయ్య, మండల కార్యదర్శి మేలిగిరి ఈరన్న, అంగన్వాడీ నాయకురాలు విజయలక్ష్మి, రోజామేరీ, కాసీంబీ, పుష్ప, దీప్తి, చామండి, విజయలక్ష్మి, రాధా పాల్గొన్నారు.

➡️