వడ్డెరలను ఎస్టీలుగా గుర్తించాలి

Jan 29,2024 19:40

జయంతి వేడుకల్లో వడ్డెర కుల పెద్దలు

– స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకల్లో వడ్డెర కుల పెద్దలు
ప్రజాశక్తి – మంత్రాలయం
ప్రభుత్వం వడ్డెరలను ఎస్టీలుగా గుర్తించాలని వడ్డెర కుల పెద్దలు కౌతాళం రాము, వడ్డే నారాయణ డిమాండ్‌ చేశారు. సోమవారం స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని అఖిల వడ్డే ఓబన్న సేవా సమితి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణంలో వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చిన్నారులు కలశాలతో ముందు రాగా ప్రత్యేక వాహనంలో వడ్డే ఓబన్న చిత్ర పటాన్ని ఉంచి పాటలను డిజె సౌండ్‌ సిస్టమ్‌ ద్వారా ఆలపిస్తుండగా, యువత నృత్యాలు చేస్తూ, రాఘవేంద్ర సర్కిల్‌ మీదుగా గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. శ్రీసుశమీంద్రతీర్థ చిల్డ్రన్స్‌ పార్కు వరకు ర్యాలీ సాగింది. అనంతరం కొండాపురం వద్ద ఉన్న గోకులంలో వన భోజనాలు ఏర్పాటు చేశారు. వడ్డెరలను ఎస్టీలుగా గుర్తించే వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు. శ్రీరాఘవేంద్ర వడ్డెర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వడ్డెరల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. అనంతరం వడ్డెర సంక్షేమ సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. కృష్ణమూర్తి, నాగరాజు, బాలరాజు, చిన్న ఈరన్న, అంగడి ఈరన్న, నరసింహ, వెంకట రాజు, వీరేష్‌, రామకృష్ణ, రాకేష్‌ శివరాజ్‌ను కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. వడ్డెరలు వర్థిరాజులు, ధర్మయ్య, కప్పన్న (ఈరన్న), మాధవ్‌, విజరు కుమార్‌, జనార్ధన్‌, రాజు, నల్లారెడ్డి, కుపేంద్ర, రాజు, నాగరాజు, వీరేష్‌, పురుషోత్తం, రాజు, రాముడు పాల్గొన్నారు.

➡️