దుద్యాల రోడ్డు బాగుపడేదెన్నడు?

Feb 10,2024 15:14 #Kurnool
roads repair

అభివృద్ధికి దూరంగా 20 ఏళ్లు
పట్టించుకోని ప్రజా ప్రతినిధులు, అధికారులు

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : కర్నూలు మండలం దుద్యాల గ్రామానికి వేసిన రోడ్డు అస్తవ్యస్తంగా మారి 20 ఏళ్లు గడిస్తున్న పట్టించుకునే నాథుడు కరువయ్యారు. కర్నూలు సుంకేసుల రోడ్డులో దుద్యాల స్టేజి వద్ద నుంచి దుద్యాల గ్రామానికి సుమారు రెండున్నర కిలోమీటర్లు పొడవున 20 ఏళ్ల క్రితం రోడ్డును నిర్మించారు. కొద్ది సంవత్సరాల తర్వాత ఆ రోడ్డు అస్తవ్యస్తంగా తయారై రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. గ్రామంలో 1800 మంది జనాభా ఉండగా సుమారు 1200 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామం నుంచి ఇతర గ్రామాలకు కర్నూలు సుంకేసుల ప్రయాణించాలన్న ఈ రోడ్డు మీదుగానే ప్రజలు రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. 20 ఏళ్లుగా గ్రామంలో చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ ఈ దారి గుండానే ప్రయాణించాల్సి ఉంది. ప్రస్తుతం ఆ రోడ్డు అడుగడుగునా గుంతలతో, కంకర తేలి దర్శనమిస్తోంది. కొన్నిచోట్ల వ్యవసాయ పొలాల్లో నుంచి వచ్చిన నీరు మోకాళ్ళ లోతు ఆగి చిన్నపాటి వాగును తలపిస్తుంది. ప చెట్లు పొదలు పెరిగి రోడ్డుకు అక్కడక్కడ అడ్డంగా విస్తరిస్తున్నాయి. ఈ రోడ్డు గుండా వాహనాల్లో వెళ్లాలంటే నరకం చవిచూడాల్సి వస్తోంది. రోడ్డు నిర్మాణం సరిగా లేదన్న కారణంతో బస్సు సౌకర్యం కూడా అందుబాటులో లేకుండా పోయింది. గర్భిణులను ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఉదయం పూట 9 గంటలకు పాఠశాలకు వెళ్లాల్సిన విద్యార్థులు రోడ్డు సరిగా లేని కారణంగా కాలినడకని నమ్ముకోవాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో విద్యార్థులు 7 గంటలకే తమ ప్రయాణాన్ని మొదలు పెట్టాల్సి వస్తుంది. గ్రామంలో ఉన్న రోడ్డు సమస్యను గురించి ఇది వరకే డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ పలు దఫాలుగా పలువురు ప్రజాప్రతినిధులకు మండల జిల్లా స్థాయి ఉన్నతాధికారులకు అనేకమార్లు మొరపెట్టుకున్నా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా పరిస్థితి తయారయింది. ఎన్నికలకు ముందు గ్రామానికి వచ్చిన ప్రతి ప్రజా ప్రతినిధి రోడ్డు పునరుద్ధరణకు గురించి ఇచ్చిన హామీలు గాలి మూటలుగా మిగిలిపోతున్నాయి. ఇప్పటికైనా గ్రామానికి నూతన రోడ్డును నిర్మించాలని లేదంటే ఈ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరిస్తున్నారు.

➡️