షెడ్యూల్‌ ఏరియా గుర్తింపునకు చిత్తశుద్ధి కరువు

Apr 20,2024 21:14

రీ సర్వే పేరుతో సాగదీత

గిరిజనులను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : 5వ షెడ్యూల్‌ ఏరియా పెంపునకు పాలక పార్టీల్లో రాజకీయ చిత్తశుద్ధి కొరవడింది. దీంతో, గిరిజన ప్రాంతంలోని భూములు, అటవీ, ఖనిజ సంపద లూటీ అవుతున్నాయి. ముఖ్యంగా 1/70 చట్టం వర్తించక పోవడంతో ఏజెన్సీలోని భూములు చాలా వరకు స్థానికేతర గిరిజనేతరులు చేత్లోకి పోతు న్నాయి. గిరిజన ప్రాంతంలో పుట్టి, పెరిగినా ఆయా గ్రామాలను షెడ్యూల్‌ ఏరియాలో చేర్చక పోవడం వల్ల కొండలు, డి-పట్టా భూములు ఆక్రమించుకోవడం వంటివి యథే చ్చగా సాగిపోతున్నాయి. చివరికి రాజ్యాంగం కల్పించిన హక్కులు, సంక్షేమ పథకాలను సైతం గిరిజనులు పొందలేకపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ప్రతిపక్షం ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. రీసర్వే పేరుతో సాగదీత ధోరణి అవలంభించడమే ఇందుకు తార్కాణంగా చెప్పుకోవచ్చు.ఉమ్మడి రాష్ట్రంలో అనేక సర్వేలు చేపట్టిన ఎపి గిరిజన సంఘం సుమారు 1200 గ్రామాలను షెడ్యూల్‌ ఏరియాలో చేర్పించాలని డిమాండ్‌ చేస్తోంది. రాష్ట్ర విభజన తరువాత విస్తీర్ణం, జనాభా రీత్యా గిరిజన ప్రాంతం మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉంది. ఈనేపథ్యంలో కనీసం 700గ్రామాలను ప్రతిపాదించాల్సి వుందని గిరిజన సంఘాలు చెబుతున్నాయి. వైసిపి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి అధ్యక్షతన 2019 నవంబర్‌ 12న జరిగిన గిరిజన సలహా మండలి సమావేశం 554గ్రామాలను 5వ షెడ్యూల్‌లో చేర్పించేందుకు తీర్మానించింది. ఇందులో విజయనగరం జిల్లాలో 182, శ్రీకాకుళం జిల్లాలో 240, విశాఖలో 91, తూర్పుగోదావరిలో 40, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక గ్రామం చొప్పున ఉన్నాయి. ఈ ప్రకటనకు 20 రోజుల వ్యవధిలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి యూటర్న్‌ తీసుకున్నారు. ప్రతిపాదిత షెడ్యూల్‌ గ్రామాల్లో కొన్నిచోట్ల అభ్యంతరాలు, మరికొన్ని గుర్తించాల్సిన గ్రామాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో రీసర్వే చేస్తామని 2019 డిసెంబర్‌ 2న పుష్పశ్రీవాణి చెప్పారు. ఇందులో వాస్తవం ఉన్నప్పటికీ, సర్వే నివేదిక 35ఏళ్ల క్రితం నాటిదని కొత్తగా చెప్పడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాలూరు మండలంలో 90రెవెన్యూ గ్రామాలు ఉండగా, షెడ్యూల్‌ ఏరియాలోవున్నవి 24 మాత్రమే ఉన్నాయి. ప్రతిపాదిత గ్రామాలు 44 ఉన్నప్పటికీ మరో పది గ్రామాల వారు షెడ్యూల్‌ ఏరియాలో చేర్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మక్కువ మండలంలో 21పంచాయతీల పరిధిలో సుమారు 54 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇందులో కేవలం శంబర గ్రామానికి చెందిన బీరమాసి ఒక్కటే షెడ్యూల్‌ ఏరియా పరిధిలోవుంది. మండలం మొత్తం అటవీ ప్రాంతంలోవుండడం, మెజార్టీ గ్రామాల్లో ఎక్కువ మంది గిరిజనులు ఉండడం వల్ల 52గ్రామాలు షెడ్యూల్‌ ఏరియాలో చేర్చాలని గిరిజన సంఘాలు ఏళ్లతరబడి డిమాండ్‌ చేస్తుండగా గిరిజన సలహా మండలి ప్రతిపాదనలో కేవలం 26 మాత్రమే ఉండడం గమనార్హం. పాచిపెంట మండలంలో 54 రెవెన్యూ గ్రామాలకుగాను ప్రస్తుతం 21గ్రామాలు మాత్రమే షెడ్యూల్‌ ఏరియాలో ఉన్నాయి. మిగిలిన అత్యధిక గ్రామాల్లో గిరిజన జనాభాయే ఎక్కువగా ఉన్నప్పటికీ ఇటీవల కేవలం 17 గ్రామాలను మాత్రమే షెడ్యూల్‌ ప్రాంతంలో చేర్పించేందుకు ప్రతిపాదించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గిరిజన మండలాల్లోనూ ఇదే పరిస్థితి దాపురించింది. ఇటువంటి పరిస్థితుల్లో 35ఏళ్ల క్రితం నాటి ప్రతిపాది జాబితాను అమలు చేసే బదులు, రీసర్వే చేపట్టడం మంచిదే. కానీ, ఆ పేరుతో కాలక్షేపం చేస్తుండడంతో గిరిజనుల్లో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పటికే షెడ్యూల్‌ ఏరియాలో లేని గిరిజన గ్రామాల్లో స్థానికేతర పెత్తందారులు వందలాది ఎకరాలు ఆక్రమించుకుని రూ.కోట్లకు పడగలెత్తారు. పార్వతీపురం మండలంలోని బోడికొండ, సాలూరు మండలంలోని తామరకొండలో నిక్షిప్తమై ఉన్న మాంగనీస్‌ గనులను కార్పొరేట్‌ శక్తులకు కారు చౌకగా కట్టబెట్టేందుకు నేటి వైసిపి, నాటి టిడిపి తీవ్ర ప్రయత్నాలు చేశాయి. గిరిజనులు సాగు చేస్తున్న భూములకు ఏళ్ల తరబడి సాగు హక్కు కల్పించకపోగా, పట్టాలు కూడా ఇవ్వడం లేదు. గిరిజనులు అటవీ ఉత్పత్తులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నా ఆయా ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంది. చాలా గ్రామాలకు నేటికీ రహదారి సౌకర్యం లేకపోవడంతో అనారోగ్యానికి గురవుతున్నప్పుడు వారికి డోలీ మోతలే దిక్కవుతున్నాయి. ఈనేపథ్యంలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అనేకసార్లు సిపిఎం, గిరిజనసంఘాలు బంద్‌ నిర్వహించాయి. అటవీప్రాంత గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్‌లో చేర్పించాలని ఎపి గిరిజన సంఘంతోపాటు సిపిఎం దశాబ్ధాలుగా పోరాడుతునే ఉన్నాయి. వీటికితోడు అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటుధర కల్పించాలని, సరవ భాషా వాలంటీర్లను మార్చి, ఏప్రిల్‌ నెలల్లో కూడా కొనసాగించాలని, జిఓ నెంబర్‌ 3 ప్రకారం షెడ్యూల్‌ ఏరియా పరిధిలోని ఉద్యోగాలన్నీ గిరిజనులతోనే భర్తీచేయాలని, గిరిజన డిఎస్‌సి ప్రకటించాలని తదితర డిమాండ్లతో ఈ ఏడాది మార్చి 10న ఎపి గిరిజన సంఘం ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్‌ నిర్వహించారు. అయినా పూర్తిగా గిరిజనులు ఉన్న గ్రామాలను 5వ షెడ్యూల్‌ ఏరియాగా ప్రకటించాలన్న డిమాండ్‌ను పరిష్కరించేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంగాని, రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలుగాని చొరవ చూలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో ముఖ్యంగా మన్యం జిల్లాలోని బిజెపి, వైసిపి ఎమ్మెల్యే, లోక్‌సభ అభ్యర్థులపై గిరిజనుల్లో వ్యతిరేకత వ్యక్తమౌతోంది. గిరిజనుల కోసం నిత్యం పోరాడుతున్న ఎర్రజెండా, సిపిఎంను గుర్తు చేసుకుంటున్నారు.

ప్రభుత్వ రాయితీలకు దూరం

దుడ్డుఖల్లు పంచాయతీ నాన్‌ షెడ్యూల్డుగా ఉండడంతో ఈ పంచాయతీలో ప్రజలు ప్రభుత్వ రాయితీలకు దూరమవుతున్నారు. ఐటిడిఎ ద్వారా ఎటువంటి రుణాలూ అందడం లేదు. దీంతో పూర్తిగా వెనుకబడి ఉన్నాం. మా గ్రామాన్ని షెడ్యూల్డు ఏరియాలో చేర్చాలి.

కొండ గొర్రి గోపాలరావు, గిరిజన యువకుడు,

దుడ్డుఖల్లు,గుమ్మలక్ష్మీపురం మండలం

➡️