సిపిఎం అభ్యర్థులను గెలిపించండి

Apr 5,2024 20:28

బిజెపి తొత్తు, పొత్తు పార్టీలను ఓడించండి

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు లోకనాధం

కురుపాం అభ్యర్థిగా మండంగి రమణ

22న నామినేషన్‌

ప్రజాశక్తి-పార్వతీపురం రూరల్‌ :  అరకు పార్లమెంట్‌ స్థానం నుంచి పి.అప్పలనర్స, కురుపాం అసెంబ్లీ స్థానం నుంచి మండంగి రమణ సిపిఎం అభ్యర్థులుగా పోటీ చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాధం ప్రకటించారు. కురుపాం అసెంబ్లీ అభ్యర్థి రమణ ఈనెల 22న నామినేషన్‌ దాఖలు చేస్తారని తెలిపారు. ప్రజా సమస్యలపైనా, గిరిజన హక్కుల కోసం పోరాడుతున్న సిపిఎం అభ్యర్థులను గెలిపించి బిజెపి, దాని తొత్తు, పొత్తు పోర్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం సుందరయ్య భవనంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మతో కలిసి ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. బిజెపి ప్రభుత్వం కేంద్రంలోను, రాష్ట్రంలోను ప్రజలను దగా చేస్తుందని, ప్రధానంగా గిరిజనులకు, రైతులకు సంబంధించిన రక్షణ చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నదని అన్నారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలను పూర్తిగా తుంగలో తొక్కుతోందని తెలిపారు. అటవీహక్కుల చట్ట ప్రకారంగా అడవులను పరిరక్షించాల్సి ఉన్నా బిజెపి ప్రభుత్వం ఆ చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తోందన్నారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసిన బిజెపి పక్షాన తెలుగుదేశం, జనసేన కూటమి కట్టడం రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయడమేనని అన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల కన్నా ఈ ఐదేళ్లలో బిజెపి ప్రయోజనాలనే కంటికి రెప్పలా కాపాడుతూ పాలన సాగించిందని అన్నారు. కార్మిక చట్టాల్లో మార్పు, ప్రభుత్వ పరిశ్రమల ప్రైవేటీరణకు పూర్తి సహాయ సహకారాలు అందించిందని వివరించారు. కావున బిజెపిని, ఆపార్టీతో పొత్తు పెట్టుకున్న టిడిపి, జనసేనను, తొత్తుగా వ్యవహరిస్తున్న వైసిపి ఓడించాలని పిలుపునిచ్చారు. సిపిఎం తరపున పోటీచేయనున్న అప్పలనర్స, మండంగి రమణ గిరిజన సమస్యలను నిరంతరం పోరాడుతున్నారని తెలిపారు. 1/70 చట్టానికి తూట్లు పొడుస్తున్న ప్రభుత్వ విధానాలకు, పీసా చట్టానికి వ్యతిరేకంగా గిరిజన హక్కుల కోసం ఉద్యమిస్తున్నారని తెలిపారు.. గిరిజన, మధ్య తరగతి ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎం అభ్యర్థులను ప్రజలు గుర్తించి ప్రజా పోరాటాలకు మద్దతు ఇవ్వాలని కోరారు. సిపిఎం సీనియర్‌ నాయకులు ఎం.కష్ణమూర్తి మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం విద్య రంగాన్ని కాషాయి కరణ చేయడం దుర్మార్గమని అన్నారు. రాష్ట్రాల హక్కులను హరించి కార్పొరేట్లకు బిజెపి తాకట్టు పెడుతోందన్నారు. విద్యుత్‌ రాష్ట్రం హక్కు కాగా, దాన్ని కేంద్రం స్వాధీనం చేసుకొని ఉచిత విద్యుత్తు, సబ్సిడీలు లేకుండా చేస్తుందన్నారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేస్తామని బిజెపి బహిరంగంగానే ప్రకటించిందని అన్నారు. మరోసారి బిజెపి అధికారం చేపడితే బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీల రిజర్వేషన్లు పోతాయని, భూ హక్కు చట్టం కూడా రద్దు అవుతుందని అన్నారు. కాబట్టి బిజెపిని, దానితో కలిసి ఎన్నికల్లో పోటీ చేసే టిడిపి, జనసేనలను, పరోక్షంగా సహకరించే వైసిపిని ఓడించాలని కోరారు. కురుపాం అసెంబ్లీ స్థానంలో రమణను, ఎంపి పార్లమెంట్‌ అభ్యర్థి అప్పలనర్సను గెలిపించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి రెడ్డివేణు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.అవినాష్‌, వై.మన్మధరావు, కొల్లి గంగునాయుడు పాల్గొన్నారు.

మండంగి రమణ బయోడేటా

పేరు : మండంగి రమణ

వయస్సు : 51

చదువు : 10వ తరగతి

తల్లిదండ్రులు : మండంగి దుబల (లేటు), మండంగి సత్తారి

భార్య : మండంగి నరసమ్మ

పిల్లలు : ఇద్దరు కుమారులు. వెంకట కిశోర్‌, తేజ

స్వస్థలం : సవరకోట పాడు (ఎస్‌కె పాడు), గుమ్మలక్ష్మీపురం మండలం

సామాజిక తరగతి : గిరిజన సవర

కుటుంబ నేపథ్యం : వ్యవసాయ కూలీ కుటుంబంపార్టీలో ప్రస్థావన : 1990లో గిరిజన సంఘంతో పరిచయం. 1994లో సిపిఎంలో చేరిక. పలు పోరాటాల్లో అరెస్టులు, విడుదల

ప్రస్తుత హోదాలు : చెముడుగూడ ఎంపిటిసి సభ్యుడు. పార్టీ మండల కమిటీ సభ్యులు. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కోశాధికారి

ప్రజాప్రతినిధి అనుభవం : రెండుసార్లు సర్పంచ్‌గా, 2సార్లు ఎంపిటిసి సభ్యుడిగా ఎన్నిక

గతంలో నిర్వహించిన బాధ్యతలు : గిరిజన సంఘం ఉమ్మడి జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, గౌరవాధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు

ప్రధాన ఆందోళనలు, పోరాటాలు : స్థానికంగా సాగునీటి చెక్‌డామ్‌ల సాధనకు పోరాటం, గిరిజన ఉత్పత్తుల గిట్టుబాటు ధరల కోసం పోరాటం, అటవీ పోడు పట్టాల కోసం ఉద్యమం, జీవో 3 పునరుద్దరణ పోరాటం, 1/70 అమలు పోరాటం, ఉద్యమాల్లో పాల్గొనడం. నాయకత్వం వహించడం

➡️