సిపిఎం అభ్యర్థులను గెలిపించండి

Apr 15,2024 22:13

ప్రజాశక్తి – కొమరాడ : బిజెపి ప్రభుత్వం కేంద్రంలోనూ రాష్ట్రంలోను ప్రజలను మోసం చేస్తున్నదని, ప్రధానంగా గిరిజనులకు, రైతులకు, కార్మికులకు, వ్యవసాయ కూలీలకు, మహిళలకు మైనార్టీలకు సంబంధించిన చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ అన్నారు. సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం దేవకొన పంచాయతీ అంటివలసలో గిరిజనులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ మౌలిక సూత్రాలను పూర్తిగా తుంగలో తొక్కుతోందన్నారు. ఏజెన్సీలో జీవో 3 ప్రకారం వంద శాతం గిరిజనులకు ఉద్యోగం ఇవ్వాల్సి ఉందని, గిరిజనులు పండించే పంటకు సంబంధించిన పంటలను జిసిసి ద్వారా పంపిణీ చేయాలని అన్నారు . అటవీ హక్కుల చట్ట ప్రకారంగా అడవులను పరిరక్షణ చేయాలని, కానీ బిజెపి ప్రభుత్వం అన్ని చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తోందన్నారు. గిరిజన యూనివర్సిటీ నిర్మాణం చేయకుండా కేంద్ర ప్రభుత్వం గిరిజన విద్యార్థులతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు. విభజన హామీలను నెరవేర్చలేదన్నారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసిన బిజెపితో టిడిపి, జనసేన కూటమి కట్టడమంటే రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయడమేనని అన్నారు. లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయకుండా సొంత గనులు కేటాయించాలని పోరాటం చేస్తుంటే బిజెపి ప్రభుత్వం స్టీల్‌ ప్లాంట్‌కు ముడి సరుకులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ వాటి ఆస్తులను ప్రైవేటుపరం చేస్తుందని అన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బిజెపిని ప్రతిఘటించాల్సిన టిడిపి జనసేన కుమ్మక్కై ఎన్డీఏ పేరుతో ప్రజల వద్దకు వెళ్తుండడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. అందుకే టిడిపి, జనసేన పార్టీలను ఓడించాలని అన్నారు. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాల కన్నా ఈ ఐదేళ్లలో బిజెపి ప్రయోజనాలనే కంటికి రెప్పలా కాపాడుతూ పాలన సాగించారన్నారు. బిజెపి ఎజెండాను తూచా తప్పకుండా జగన్మోహన్‌ రెడ్డి అమలు చేస్తూ పరోక్షంగా బిజెపికి మద్దతు తెలుపుతుందని, కాబట్టి వైసిపిని కూడా ఓడించాలని పిలుపునిచ్చారు. సిపిఎం, సిపిఐ కాంగ్రెస్‌ ఒక నిర్దిష్టమైనఅవగాహనతో ఇండియా వేడికగా ఏర్పడి పోటీ చేస్తున్నాయని తెలిపారు. అరకు పార్లమెంట్‌ స్థానం నుంచి ఎంపిగా పోటీ చేస్తున్న అప్పలనర్స, కురుపాం నుంచి పోటీ చేస్తున్న మండంగి రమణను గెలిపించాలని కోరారు. వీరిద్దరూ ప్రజల తరపున పోరాడుతున్నారని తెలిపారు. గిరిజన, పేద మధ్య తరగతి ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎం అభ్యర్థులను ప్రజలు గుర్తించాలని కోరారు. ఈనెల 19న ఎంపి అభ్యర్థి అప్పలనర్స పార్వతీపురం లోను, 23న మండంగి రమణ కురుపాంలోను నామినేషన్లు వేయనున్నారని, ప్రజలంతా పెద్ద ఎత్తున కదలి రావాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు వి.ఇందిర, కె.సాంబమూర్తి, గిరిజన సంఘం నాయకులు గంగరాజు వెంకటేశు బలరాం చిన్నారావు సన్యాసిరావు, మహిళలు పాల్గొన్నారు.

➡️