అంగన్వాడీలపై సిఎం బూటకపు ప్రేమ

Jan 13,2024 20:29

పార్వతీపురంరూరల్‌: ఎన్నికల ముందు అబద్ధపు హామీలతో అంగన్వాడీలపై ముఖ్యమంత్రి బూటకపు ప్రేమను కురిపించారని, అధికారంలోకి వచ్చిన తర్వాత తమను రోడ్డు ఎక్కించారని అంగన్వాడీ జిల్లా నాయకులు వాపోయారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు చేపడుతున్న నిరవధిక సమ్మె శనివారానికి 33వ రోజు కొనసాగుతున్న నేపథ్యంలో స్థానిక కలెక్టరేట్‌ వద్ద అంగన్వాడీలు 33 అంకె ఆకృతిలో కూర్చొని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి గంట జ్యోతి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు సామాజిక వర్గాల్లో, కార్మికుల్లో మహిళలకు మొదటి ప్రాధాన్యత కల్పిస్తున్నామన్న ప్రచారం ఒట్టి బూటకపు ప్రచారమని, ఆచరణలో శూన్యమని విమర్శించారు. మహిళా సాధికారతే ప్రభుత్వ ధ్యేయమనుకుంటే అంగన్వాడీలు కూడా మహిళలేనిని గమనించాలని గుర్తు చేశారు. కుటుంబాల సైతం తృణప్రాయంగా పెట్టి పోరాడుతున్న అంగన్వాడీల పట్ల ప్రభుత్వ మొండిగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. అంగన్వాడీ మహిళా అంటే ఒక వ్యక్తి మాత్రమే కాదని పెద్ద సమూహమని అన్నారు. సమ్మె ప్రారంభం నుండి ఇప్పటి వరకు అనేక దఫాలుగా ప్రభుత్వ అధికారులు చర్చలు చేపడుతున్నా, ఏ ఒక్క సమస్య పరిష్కారమయ్యే దిశగా లేవని, చర్చలకు ఆహ్వానించి బెదిరింపులకు, దౌర్జన్యాలకు పాల్పడడం అమానుషమని వాపోయారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అంగన్వాడీల పట్ల జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కర్కషంగా వ్యవహరిస్తుందని, మన ఐక్యతను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. చర్చలతో కాలయాపన చేయకుండా ప్రభుత్వం సమ్మె డిమాండ్లు పరిష్కారానికి నిర్దిష్ట హామీని అందించాలని, లేకుంటే భవిష్యత్తులో ఆందోళన ఉధృతం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు గౌరీమణి, ధర్మవతి, రాజేశ్వరి, శాంతి మరియు తదితరులు పాల్గొన్నారు. పాచిపెంట : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మండలంలోని పనుకువలస వద్ద కోటి సంతకాల సేకరణ ప్రాజెక్ట్‌ నాయకులు ఎం.బంగారమ్మ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా బంగారమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలు చేస్తున్న న్యాయమైన పోరాటాన్ని గుర్తించి చట్టపరంగా వారి హక్కులను కాపాడాలని, వేతనాలు పెంచాలని కోరారు. సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ అంగనవాడీిలపై చిన్నచూపు మానుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు జట్ల వెంకట్రావు, ఎస్‌.సూర్యనారాయణ, ఐద్వా నాయకులు లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. గరుగుబిల్లి : అంగన్వాడీల సమ్మె 33వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో శనివారం మండల కేంద్రంలోని సమ్మె శిబిరం వద్ద అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియూ జిల్లా కార్యదర్శి బివి రమణ మాట్లాడుతూ అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య ధోరణితో కక్ష సాధింపు విధానాలు అవలంభిస్తుందని విమర్శించారు. అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అంగన్వాడీలు ఇదే పట్టుదలతో భవిష్యత్తు ఉద్యమాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అంగన్వాడీ ప్రాజెక్ట్‌ యూనియన్‌ నాయకులు సిహెచ్‌.గౌరమ్మ, ఎం.సావిత్రి, కృష్ణవేణి, స్వాతి, పద్మావతి, హైమావతి తదితరులు పాల్గొన్నారు. గుమ్మలక్ష్మీపురం : అంగన్వాడీలు చేపడుతున్న సమ్మెకు మద్దతుగా గుమ్మలక్ష్మీపురంలో సిఐటియు నాయకులు కోటి సంతకాలు సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మండంగి రమణ, కోలక అవినాష్‌ మాట్లాడుతూ అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని 32 రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేయడం విచారకరం అన్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటాలు కొనసాగుతాయని సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు సత్యవతి, కస్తూరి, పలువురు గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు.కురుపాం : అంగన్వాడీలు సమ్మె ప్రారంభించి శనివారంతో 33 రోజులు అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో సమ్మె శిబిరం దగ్గర ప్రధాన రహదారిపై 33వ అంకె ఆకారంలో కూర్చుని నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు పి.సరళ కుమారి, ప్రాజెక్టు కార్యదర్శి జె.సరోజ, సెక్టార్‌ లీడర్లు ఎం.మీనాక్షి , డివి రత్నం, బి.జయలక్ష్మి, ఎస్‌.సులోచన, డి.జ్యోతిలక్ష్మి, ఎన్‌.సుమతి తదితరులు పాల్గొన్నారు.భోగి మంటల్లో ఎస్మా, షోకాజ్‌ నోటీసులు సాలూరు :తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు చేపట్టిన సమ్మె 33రోజుకు చేరింది. శనివారం అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు ఎ.నారాయణమ్మ, శశికళ ఆధ్వర్యాన కార్యకర్తలు, హెల్పర్లు ప్రభుత్వం జారీ చేసిన ఎస్మా, షోకాజ్‌ నోటీసులను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. చర్చలకు పిలిచి బెదిరింపులకు దిగుతోందన్నారు. కవ్వింపు చర్యలు మానుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు తిరుపతమ్మ, సుభద్ర, సుజాత పాల్గొన్నారు. సీతానగరం : 33వ రోజు కొనసాగిన అంగన్‌వాడీలు దీక్షా శిబిరం వద్ద పిండివంటలు తయారు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి గవర వెంకటరమణ మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనాలు అమలు చేసి ఉద్యోగ భద్రత ఇచ్చి తెలంగాణ కన్నా ఒక వెయ్యి అదనంగా జీతం పెంచుతామని హామీ ఇచ్చి నేడు అదే హామీల కోసం 33 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోవడంలేదన్నారు. అంగన్వాడీల ఆకలి బాధలు వినకుండా ఉన్నారని, వాటికి నేటి సమ్మె సంక్రాంతి పిండి వంటలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు వెన్నెల రామలక్ష్మి మడక సత్యవతి, మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు మరిచర్ల సునీత, పి.యశోద, ఆర్‌, లక్ష్మి తదితర అంగన్వాడీలు పాల్గొన్నారు. బలిజిపేట : మండల కేంద్రంలోని సమ్మె శిబిరం వద్ద అంగన్వాడీలు చీరలతో ఉరి వేసుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్‌ ప్రాజెక్టు నాయకులు కె.దాలమ్మ, సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి వై.మన్మధరావు మాట్లాడుతూ అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య ధోరణితో కక్ష సాధింపు విధానాలు అవలంభిస్తుందన్నారు. చర్చలకు పిలిచి అంగన్వాడీలను అవమానపర్చి, బెదిరింపులకు దిగుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన మొండి వైఖరి విడనాడి అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, లేనిచో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ ప్రాజెక్ట్‌ యూనియన్‌ నాయకులు ఇందిర, స్వర్ణ, గౌరమ్మ, శారద, సావిత్రి, కష్ణవేణి, పద్మావతి, హైమావతి తదితరులు పాల్గొన్నారు.సీతంపేట: ఐటిడిఎ ఎదుట 33వ రోజు నిరవధిక సమ్మె సందర్భంగా గిరిజన జెఎసి నాయకులు రామస్వామి సమ్మె శిబిరం వద్ద హాజరైన అంగన్వాడీ ఉద్యోగులు మరింత సంఘటితమవుతున్నారు. ప్రభుత్వ మొండి వైఖరిని తిప్పి కొట్టాలనారు. ప్రజల చేత ఎన్నుకోబడే ప్రభుత్వాలు నియంతలా ప్రవర్తంచరాదన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్టు కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎ.పార్వతి, ఎ.దర్శమి, సిఐటియు మండల కాంతారావు, అంగన్‌వాడీలు ప్రియ, అరుణకుమారి, అంజలి తదితర కార్యకర్తలు పాల్గొన్నారు

➡️