అండర్‌ బ్రిడ్జి నిర్మాణానికి వినతులు

Feb 5,2024 21:15

పార్వతీపురం రూరల్‌ : పార్వతీపురం కొత్తవలస రైల్వే స్టేషన్‌కు అనుసంధానంగా అండర్‌ బ్రిడ్జి నిర్మాణం కోసం అరకు ఎమ్‌పి గొడ్డేటి మాధవిని, రైల్వే డిఆర్‌ఎం సరవ్‌ ప్రసాద్‌, సీనియర్‌ డివిజనల్‌ ఇంజినీర్‌ మీనా లను సోమవారం విశాఖలోని వారి కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేసినట్లు ఎపి టిడ్కో ఛైర్మన్‌ జమ్మాన ప్రసన్న కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్వతీపురం లో నిర్మించిన ఫ్లై ఓవర్‌ వల్ల స్థానిక కొత్తవలస సమీపంలో ఉన్న రైల్వే లైన్‌పై దాటుకుంటూ స్కూల్‌ పిల్లలు, పెద్దలు వెళ్లడానికి, ముఖ్యంగా ఆ ప్రాంతంలో అంతిమ సంస్కారాలు చేసేందుకు శ్మశానానికి వెళ్లేందుకు ఇబ్బందికరంగా మారిందని, సుమారు 9 గ్రామాల రాకపోకలకు, కొత్తవలస ప్రాంతం ప్రజలకు మేలు జరిగే విధంగా అండర్‌ పాస్‌వే నిర్మాణం జరుపాలని కోరామన్నారు. దీనికి స్పందించిన రైల్వే అధికారులు విజయరామరాజు కాలనీ కొత్తవలస నుండి బెలగాం రైల్వే గేట్‌ వరకు 60 అడుగుల రోడ్‌ నిర్మాణానికి మధ్యలో అండర్‌ పాస్‌ నిర్మాణం తక్షణం చేపట్టడానికి అంగీకరించారన్నారు. కొత్తవలస విజయరామరాజు కాలనీ నుండి సత్యనారాయణ స్వామి టెంపుల్‌ వైపు, అండర్‌ పాస్‌ లేదా ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి అధికారులు బృందాన్ని పంపించి సర్వే జరిపిస్తామని, అండర్‌ పాస్‌ బ్రిడ్జి నిర్మాణం పై సాధ్యా సాధ్యాలు పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు జమ్మాన తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవకోటి శంకర్‌ రావు, భోఘవిల్లి శేఖర్‌, పాత్రుని దినేష్‌, దివిలి ఉమా మహేశ్వర రావు పాల్గొన్నారు.

➡️