అభివృద్ధి పనులకు డిప్యూటీ సిఎం శంకుస్థాపన

Mar 1,2024 20:49

సాలూరురూరల్‌ : మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవ, శంకుస్థాపన కార్యక్రమాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పీడిక రాజన్నదొర శుక్రవారం పాల్గొన్నారు. కొత్తవలసలో ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో రూ.1.75 కోట్ల అంచనా విలువతో నిర్మించిన అదనపు వసతి గదులను, కోటి రూపాయలతో నిర్మించే వంట గది, భోజనశాలలకు శంకుస్థాపన చేశారు. అలాగే మూలవలసలో కొత్తగా నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు, గ్రామస్తులతో మమేకమయ్యారు. పాఠశాల బాలికలు ఆనంద కోలాహలంతో నృత్యాలతో స్వాగతం పలికారు. పిల్లలందరితో నేరుగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, వీటిని వినియోగించుకొని తద్వారా ఉన్నత శిఖరాలకు చేరాలని పిలుపునిచ్చారు. 8వ తరగతి విద్యార్థులకు టాబ్‌లను అందజేసి డిజిటల్‌ బోధనకు శ్రీకారం చుట్టారని ఆయన పేర్కొ న్నారు. అంతర్జాతీయ విద్యా ప్రమాణాలు అందించేలా ఇంటర్నేషనల్‌ బకలారియట్‌తో ఒప్పందం చేసుకోవడం, వివిధ విదేశీ విశ్వ విద్యాలయాల నుండి సర్టిఫికేట్‌ జారీ వంటి చర్యలు తీసుకున్నట్టు వివరించారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపు నిస్తూ విద్యార్థులంతా ఆరోగ్యంగా ఉండాలని, ఒత్తిడి లేని విద్యను అభ్యసించాలని హితవుపలికారు. విద్యార్థుల ఆరోగ్యంపై ఉపాధ్యాయులు, వసతి గృహ సంక్షేమ అధికారులు దృష్టి సారించాలన్నారు. అలాగే గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గిరిజన గ్రామాల్లో రహదారి సౌకర్యం కల్పించేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఇటీవల మారుమూల గిరిజన గ్రామాలకు రహదారుల నిర్మాణం, వంతెనల నిర్మాణానికి పనులు ప్రారంభించా మని ఆయన చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రెడ్డి పద్మావతి, వైస్‌ ఎంపిపి రెడ్డి సురేష్‌, పలువురు అధికారులు నాయకులు పాల్గొన్నారు.

➡️