ఆస్తులు అమ్మి చెల్లింపు చేయాలి

Dec 11,2023 20:42

పార్వతీపురం టౌన్‌: అగ్రిగోల్డ్‌ ఆస్తులు అమ్మయినా బాధితులకు చెల్లింపులు చేపట్టాలని సిపిఎం, సిపిఐ, తెలుగుదేశం, జనసేన, సిపిఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు డిమాండ్‌ చేశారు. అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌, ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద నిరసన సత్యాగ్రహ దీక్షను జిల్లా అధ్యక్షులు గెంబలి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈదీక్షలో ముఖ్య అతిథిగా అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఈవి నాయుడు పాల్గొన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు రెడ్డి వేణు, కూరంగి మన్మధరావు, ఎఐటియుసి ఉమ్మడి జిల్లా కార్యదర్శి బుగత అశోక్‌, టిడిపి సీనియర్‌ నాయకులు బార్నాల సీతారాం, పొట్నూరు వెంకట నాయుడు, జననసేన నాయకులు వంగల దాలినాయుడు, సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా కన్వీనర్‌ పి. సంగం, సిఐటియు జిల్లా కార్యదర్శి యమ్మల మన్మధరావులు దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018 మార్చిలో నాటి ప్రతిపక్ష నాయకునిగా నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అగ్రిగోల్డ్‌ బాధితుల దీక్షల శిబిరానికి వచ్చి మన ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లో రూ.20 వేలలోపు బాధితులకు రూ.1180 కోట్లను చెల్లిస్తానని, 6నెలల్లో బాధితులందరికీ పూర్తి న్యాయం చేస్తానని, యాజమాన్యం సంగతి తాను చూసుకుంటానని, కోర్టు బాధ్యత తనదేనని హామీ ఇచ్చారన్నారు. తీరా గెలిచిన ముఖ్యమంత్రి రూ.10వేలు, రూ.20వేలు లోపు ముఖ్యమంత్రి 10వేలు, రూ.20వేలు లోపు బాధితులకు కొంతమందికి మాత్రమే రూ.906 కోట్లు మాత్రమే చెల్లింపులు చేశారని, ఇంకా రూ.3050 కోట్లు ఇవ్వాలని కోరారు. అగ్రిగోల్డ్‌ బాధితుల సొమ్ముతో కొన్ని వేల కోట్ల విలువ చేసే భూములు ఇప్పుడు సిఐడి చేతిలో అటాచ్‌ చేయబడి ఉన్నాయని, పై ఆస్తులను ప్రభుత్వం వారు ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకొని లేదా ఆస్తులను వేలం వేసైనా బాధితులకు పూర్తి చెల్లింపులు చేపట్టాలని అన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటానికి ఇంకా 2 నెలలు సమయం మాత్రమే ఉన్నాయని బాధితులకు పూర్తి న్యాయం చేయకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమంలో అగ్రిగోల్డ్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి సాలాపు అనంతరావు, నాయకులు ఆర్‌.ఆదినారాయణ, ఆర్‌. మురళీ డాక్టర్‌, సాయిరాం, బి. వెంకటరమణ, (చిరు) బిటిఆర్‌ నాయుడు, బి. బంగారి, రామారావు మహారాణా, వెల్లంకి గోవింద, శ్రీను, సొండి గౌరిశంకరరావు, పాల్తేరు శ్రీను అధిక సంఖ్యలో బాధితులు పాల్గొన్నారు.

➡️