ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు

Jan 29,2024 20:51

పార్వతీపురంరూరల్‌ : మార్చిలో జరగనున్న ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు తెలిపారు. పరీక్షల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి పరీక్షల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పరీక్షల నిర్వహణలో భాగమైన వివిధ శాఖల ముందస్తు ఏర్పాట్లపై డిఆర్‌ఒ సమీక్షించారు. పరీక్షల నిర్వహణలో ఆయా శాఖలకు కేటాయించిన పనుల ఏర్పాట్లు పూర్తిచేయాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం బస్సులు నడపాలని ప్రజా రవాణాశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. రైల్వే గేట్లు గల గ్రామాల నుంచి వి ద్యార్థులు ముందుగా బయలుదేరేలా చూడాలని తెలిపారు. పరీక్షలు జరుగురోజులలో ఉదయం 8 గంటలనుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో మంచినీరు ఏర్పాటుచేయాలని తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖ పరీక్షా కేంద్రాల్లో మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షను అమలు చేయాలని, ఎస్కార్ట్‌, పోలీసు బందోబస్తు ఏర్పాటుచ ేయాలని పోలీసు అధికారులకు తెలిపారు. పరీక్షల నిర్వహణ తనిఖీ చేసేందుకు సిట్టింగు, ఫ్లయింగు స్క్యాడ్‌ లను ఏర్పాటు చేయాలని తెలిపారు. పరీక్షల నిర్వహణ అనంతరం జవాబు పత్రాల బండిల్స్‌ సకాలంలో పంపించేందుకు, పరీక్షల నిర్వహణ అధికారులకు పోస్టలు సిబ్బంది సహకరించాలని తెలిపారు. జిల్లా ఇంటర్మీడియెట్‌ ఎడ్యుకేషన్‌ అధికారి డి.మంజులవీణ పరీక్షల ఏర్పాట్ల గూర్చి తెలియజేస్తూ జిల్లా కేంద్రంలో స్ట్రాంగు రూం, జిల్లాలో 32 పరీక్షా కేంద్రాలు, 14 స్టోరేజి పాయింట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫిబ్రవరి 5 నుంచి 20వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు, మార్చి 1నుంచి 20వరకు రాతపరీక్షలు నిర్వహించనున్నటు తెలిపారు. మొత్తం 17268 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అదికారి బి.సత్యనారాయణ, పోలీసు సర్కిల్‌ ఇనస్పెక్టరు పి.వి.వి.ఎస్‌.ఎన్‌. కష్ణమూర్తి, కలెక్టరేట్‌ డి సెక్షను సూపరింటెండెంటు ఎం.రమణమ్మ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️