ఇరు పార్టీల్లోనూ కదనోత్సవం

Jan 29,2024 20:48

పార్వతీపురంరూరల్‌: మరో 70రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రధాన పార్టీలైన వైసిపి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైన అలజంగి జోగారావు, బోనెల విజయచంద్ర పూర్తి స్థాయిలో తమ తమ శ్రేణులను బలోపేతం చేసుకొని ఎన్నికల రణరంగానికి కదనోత్సవంతో ఉరకలు వేస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులను కాదని ఈసారి ఎన్నికలకు బోనెల విజయచంద్రతో వెళ్లేందుకు ఆయనకు నాలుగు నెలల క్రితం ఆ పార్టీ అధినేత చంద్రబాబు నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. అలాగే పార్వతీపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన అలజంగి జోగారావు అటు ప్రభుత్వ పథకాల అమల్లోనూ, పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు గడప గడప వంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున విజయవంతం చేసి అటు అధిష్టానం, ఇటు నియోజకవర్గ ప్రజలు పార్టీ కార్యకర్తలు నాయకుల దృష్టిలో మంచి మార్కులు సంపాదించుకున్నారు. ఇటీవల నియోజకవర్గంలో చేరికలు రాజకీయానికి ఇరుపార్టీల నేతలు తెర లేపారు. భారీగా కప్పగెంతులు అధికార వైసిపి నుంచి ప్రతిపక్షం టిడిపిలోకి, ప్రతిపక్ష పార్టీ నుంచి అధికారపక్షం లోనికి వీలైనంత మందిని చేర్చుకుని ఒకర్ని మించి ఒకరు పోటీపడుతున్నారు. ఈ పరిస్థితి పార్వతీపురంలో మొదలై, సీతానగరం, బలిజిపేట మండలాలకు పాకింది. దీనివల్ల రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఇదిలా ఉండగా, ఇరు పార్టీల్లోని ఆశావహులు మాత్రం అభ్యర్థుల మార్పు కచ్చితంగా ఉంటుందన్న చర్చ జరుగుతోంది. అధికార పార్టీ నుంచి స్థానిక ఎమ్మెల్యే అలజంగికి బదులు ఈసారి టిడ్కో చైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్‌కు అవకాశం కల్పిస్తారనే ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. బలమైన అలజంగికి బదులుగా వేరొకరిని తీసుకువచ్చే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే అనుకూల వర్గం వాదిస్తోంది. వైసిపి అధినాయకుడు జగన్మోహన్‌రెడ్డి ఇటీవల రాష్ట్రంలో ఎస్సీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్పు చేస్తున్న విషయం ఈ వాదనకు బలం చేకూరుస్తుంది. అలాగే పార్వతీపురం నియోజకవర్గం టిడిపి ఇన్చార్జినే మార్చారని అసెంబ్లీ అభ్యర్థిగా పాత చిరంజీవులకు గానీ, లేదా అదే సామాజిక వర్గంలో పెద్ద స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగి భార్యకు అవకాశం కల్పిస్తారని బోనెల విజరుచంద్ర వ్యతిరేక గ్రూపు ప్రచారం చేస్తుంది. ఈ పార్టీలో ఒక సామాజిక వర్గంలో పట్టు ఉన్న టిడిపి సీనియర్‌ నాయకుడు విజయచంద్రకు సహకరించడంలేదని, కావున టిడిపి అభ్యర్థి మార్పుకు టిడిపి పోలిట్‌ బ్యూరో స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారాలను ఏమాత్రం పట్టించుకోకుండా అటు అలజంగి జోగారావు గానీ, ఇటు బోనెల విజయచంద్ర గానీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పగలు, రాత్రి అనకుండా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను సందర్శిస్తూ, ఆయా పార్టీ అనుకూలురను కలుపుకొని రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. సాధారణ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో రెండు పార్టీల అధినాయకులు తమ తమ అభ్యర్థులను అధికారంగా ప్రకటించి పార్వతీపురం నియోజకవర్గంలో నెలకొన్న ఈ సందిగ్ధ పరిస్థితులకు తెరదించాలని టిడిపి, వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కోరుతున్నారు.

➡️