ఉద్యోగుల పోరాటాలకు ప్రజాసంఘాల మద్దతు

Dec 30,2023 21:08

పార్వతీపురంరూరల్‌: రాష్ట్రంలో సమ్మె చేస్తున్న అంగన్వాడి, మున్సిపల్‌, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పార్వతీపురం మన్యం జిల్లా ప్రజా సంఘాల నాయకులు వారికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సమ్మెలో ఉన్న ఉద్యోగులు, కార్మికులకు సంఘీభావంగా శనివారం పార్వతీపురం ఆర్‌టిసి కాంప్లెక్స్‌ నుంచి కలెక్టర్‌ ఆఫీస్‌ వరకు సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు సంఘాల ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు వై మన్మధరావు, టి.జీవరత్నం, గొర్లి వెంకటరమణ, పి. శ్రీనునాయుడు తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మికులు, ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేస్తూ అనేక రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నా ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం విచారకరమని ఆందోళన వ్యక్తం చేశారు. 19 రోజులుగా అంగన్వాడీలు, మునిసిపల్‌ ఉద్యోగులు ఐదు రోజులుగా, సమగ్ర శిక్ష ఉద్యోగులు 11 రోజులుగా సమ్మె చేస్తున్నారని వీరితో చర్చలు జరిపాల్సిన ప్రభుత్వం చర్చలు జరపకుండా మొండిగా వ్యవహరిస్తుందని అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడానికి సిద్ధ పడకపోవడం దుర్మార్గమని అన్నారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులను బెదిరింపులకు పాల్పడి షోకాజ్‌ నోటీసులు ఇచ్చి క్రమశిక్షణ చర్యలకు పూనుకోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా కార్మికులు, ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని, నిర్భందాన్ని విడనాడాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బివి రమణ, వి. ఇందిర, బి.లక్ష్మి, జి. జ్యోతి, శాంతి, ఐఎఫ్‌టియూ నాయకులు సర్వేశ్వరరావు, అఖిల భారత రైతు కూలి సంఘం నాయకులు బి నరసింగరావు, ఎం. భాస్కరరావు, మహిళా సంఘం నాయకులు విజయలక్ష్మి, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు పి. సన్యాసిరావు, జి. తులసి తదితరులు పాల్గొన్నారు.

➡️