ఓటేసేందుకు వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు

Mar 1,2024 20:41

పార్వతీపురం : రానున్న లోక్‌సభ, శాసన సభ సాధారణ ఎన్నికల్లో విభిన్న ప్రతిభావంతులు ఓటు హక్కును వినియోగించుకోవడంలో పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు స్వీప్‌ నోడల్‌ ఆఫీసర్‌ ఎ.రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో స్పందన సమావేశ మందిరంలో స్వీప్‌ కార్యక్రమం ద్వారా విభిన్న ప్రతిభావంతులకు ఓటరు నమోదు, ఓటు హక్కు వినియోగిం చుకోవడంపై అవగాహన కార్యక్రమం జరిగింది. అనంతరం రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని ఓటు నమోదు చేసుకోవడంతో పాటు ఓటును వినియోగించుకోవడం ఓటరు బాధ్యతని ఆయన తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం దివ్యాంగులకు సాక్ష్యం యాప్‌ను రూపొందించిందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఓటును వినియోగించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుందన్నారు. పోలింగ్‌ రోజున దివ్యాంగులకు సులభతరంగా ఓటు నమోదుపై ప్రత్యేకమైన ఏర్పాట్ల సౌకర్యాలు కల్పిస్తున్నారని ఆయన తెలిపారు. ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచడానికి కేంద్ర ఎన్నికల సంఘం దివ్యాంగుల్లో చైతన్యం కలిగించి ఓటు హక్కు వినియోగిం చుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాలకు రాలేని వికలాంగులను గుర్తించి ఇంటి వద్ద నుంచి ఓటు వేసేలా ఏర్పాటు చేశారని తెలిపారు. ఓటు నమోదు చేసుకోకుండా ఉన్నవారుంటే ఫారం 6 అలాగే తప్పులను సరి చేసుకోవడానికి ఫారం 8 ను ఉపయోగించుకునే లాగా ఆన్లైన్‌ ద్వారా ఎన్నికల సంఘం అవకాశం కల్పించింద న్నారు. అవగాహన కార్యక్రమంలో అంధ దివ్యాంగులైన వారికి ఇవిఎంల ద్వారా బ్రెయిలీ లిపి ఏర్పాటు చేసి ఓటు హక్కు వినియోగించడానికి ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందన్నారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అధికారిని కె.కవిత ఓటు ప్రాముఖ్యతను తెలియజేస్తూ, 18 ఏళ్లు దాటిన వికలాంగులంతా ఓటరుగా నమోదు కావాలని అన్నారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులతో ఓటు హక్కు సద్వినియోగంపై నినాదాలు చేయించారు. కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన విభిన్న ప్రతిభావంతులు, పాల్గొన్నారు.

➡️