జగనన్న దూకుడుపై సిట్టింగ్‌ల్లో గుబులు

Dec 12,2023 22:05

సాలూరు :’ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చినట్టు’ తెలంగాణ ఎన్నికల్లో అధికార బిఆర్‌ఎస్‌ ఓడిపోవడం రాష్ట్రంలో సిటింగ్‌ ఎమ్మెల్యేల్లో గుబులు పుట్టిస్తోంది. అక్కడ అధికార పార్టీ ఓటమి పాలవ్వడంతో ఎపిలో అధికారపార్టీ అప్రమ త్తమవుతోంది. ప్రజావ్యతిరేకత ఎదుర్కొం టున్న ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చిన కారణంగానే బిజెపి ఓడిపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వైసిపి నాయకత్వం కూడా ఇప్పటి నుంచే దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ పెనుమార్పులు ఉండొచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల ఇంఛార్జి వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలను పరిశీలిస్తే పార్టీ ప్రయోజనాల దృష్ట్యా నియోజకవర్గ అభ్యర్థుల్లో మార్పులు, చేర్పులు ఉండొచ్చు నని తెలుస్తోంది. తెలంగాణా ఎన్నికల ముందు వరకు ఉమ్మడి విజయనగరం జిల్లాలో దాదాపు సిటింగ్‌ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఖరారయ్యాయనే ప్రచారం జరిగింది. అయితే తాజా పరిణామా లను బట్టి చూస్తే పార్వతీపురం మన్యం జిల్లాలోనూ పెనుమార్పులు వుండొచ్చు ననే వాదనలు తెరపైకి వస్తున్నాయి. మన్యం జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో మూడు ఎస్టీ, ఒకటి ఎస్సీలకు రిజర్వ్‌ చేయబడ్డాయి. డిప్యూటీ సిఎం రాజన్నదొర సాలూరు నియోజకవర్గం నుంచి ఇప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో ఓడిపోయినా కోర్టు తీర్పు ద్వారా 2006లో ఎన్నికయ్యారు. ఆ తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. అయితే రానున్న ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాలతో కొంత విసుగు చెందిన ఆయన ఎంపీగా పోటీ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఆయన అనుకున్నదే జరిగితే అసెంబ్లీ అభ్యర్థిగా కొత్త నేత వచ్చే అవకాశం ఉంది. పార్టీ అంతర్గత సర్వేల్లో కూడా ఆయనకు సానుకూల పరిస్థితులు లేవనే అభిప్రాయాన్ని కొంతమంది నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే లేదా ఎంపీల్లో ఏది ఇచ్చినా పోటీకి సిద్ధమేనని, అధిస్థానం నిర్ణయమే శిరోధార్యమని ఆయన చెపుతున్నారు. ఇక పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గంలో సిటింగ్‌ ఎమ్మెల్యే అలజంగి జోగారావు రెండోసారి పోటీకి సిద్ధంగా ఉన్నారు. ఆయన పట్ల పార్టీ శ్రేణుల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. గడచిన ఐదేళ్లలో నియోజకవర్గంలో ఎక్కువగా భూదందాలు, కబ్జాలు జరిగాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వీటి వెనుక ప్రధాన సూత్రధారి కీలక అధికారపార్టీ నాయకుడేననే చర్చ నడుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో సిటింగ్‌ ఎమ్మెల్యేకు సీటు దక్కడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టిడ్కో చైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్‌, మాజీ ఎమ్మెల్యే సవరపు జయమణి కూడా టికెట్‌ ఆశిస్తున్నారు. అధిష్టానం వీరిలో ఎవరికి టికెట్‌ ఇస్తుందా లేదా కొత్త వ్యక్తికి అవకాశం కల్పిస్తుందా అనేది తేలాల్సి ఉంది. కురుపాం నియోజకవర్గంలో సిటింగ్‌ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణిపై పార్టీలో వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ అంతర్గత సర్వేల్లోనూ ఆమెపై అనుకూల వాతావరణం లేదనే ప్రచారం జరుగుతోంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పని చేసిన సమయంలో ఆమెపై అవినీతి ఆరోపణలు కొంతవరకు వినిపించాయి. పాలకొండ ఎమ్మెల్యే వి.కళావతి విషయంలో కొంత సానుకూల దృక్పథం కనిపిస్తోందనే చర్చ నడుస్తోంది. ఆమె మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆమె ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ కనుసన్నల్లోనే పాలన సాగిస్తున్నారు. మాజీ మంత్రి పుష్పశ్రీవాణి సోదరి పేరు ఇక్కడ తెరపైకి వస్తున్నప్పటికీ అంతిమంగా కళావతికే సీటు దక్కనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ ఆశీస్సులు కూడా కళావతికే ఎక్కువగా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ముహూర్తం సమీపిస్తున్న నేపథ్యంలో సిఎం జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న దిద్దుబాటు చర్యలు ఎవరి కొంప ముంచుతాయోనని సిటింగ్‌ ఎమ్మెల్యేల్లో గుబులు రేపుతోంది. ఈనెలాఖరుకల్లా అభ్యర్థులు ఎవరనేది స్పష్టత వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

➡️