జిల్లాకు నేడు ఎలక్షన్‌ రోల్‌ అబ్జర్వర్‌ రాక

Dec 20,2023 19:54

పార్వతీపురంరూరల్‌ : ఉన్నత విద్య రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, జిల్లా ఎలక్షన్‌ రోల్‌ అబ్జర్వర్‌ జె.శ్యామలరావు జిల్లాకు గురువారం రానున్నారని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం – 2024లో భాగంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎటువంటి సందేహాలు, సమస్యలున్నా జిల్లా ఎలక్షన్‌ రోల్‌ అబ్జర్వర్‌కు తెలియజేయవచ్చని అన్నారు.26 తేదీకి క్లైములు పరిష్కారంఓటరు జాబితాలో క్లైములు, అభ్యంతరాలపై డిసెంబరు 9వరకు స్వీకరించిన దరఖాస్తులను ఈనెల 26 నాటికి వాటిని పరిష్కరిస్తామని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. బుధవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముసాయిదా ఓటరు జాబితాపై క్లైములు, అభ్యంతరాలను డిసెంబరు 9 వరకు స్వీకరించడం జరిగిందని, వాటిని డిసెంబరు 26 నాటికి వాటిని పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. 2024 జనవరి 1న ఓటరు జాబితా తయారుచేసి జనవరి 5న తుది ప్రచురణ చేస్తామన్నారు. ఓటరు జాబితాలో ఓటరుగా నమోదు ఎన్నికల సమయం వరకు అవకాశం ఉంటుందని, కావున 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహించిన ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో 42360 ఫారం – 6, 46128 ఫారం – 7, 97230 ఫారం – 8 స్వీకరించడం జరిగిందని, వాటిపై విచారణ జరిపి డిసెంబరు 26 నాటికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 18ఏళ్లు నిండిన వారిని ఓటర్లుగా చేర్పించేందుకు గానూ జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో ప్రత్యేక నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగు మిషన్‌, వివి పాట్‌ పనితీరు, ఓటు వేసే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా ఎన్నికల కార్యాలయం, రిటర్నింగ్‌ అధికారి ప్రధాన కార్యాలయం లేదా రెవెన్యూ సబ్‌-డివిజన్‌ అధికారుల వద్ద శాశ్వత సెంటర్లు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మొబైల్‌ ప్రదర్శన వ్యాన్‌ ఏర్పాటు చేశామని, మొబైల్‌ వ్యాన్‌ షెడ్యూలు ముందుగా రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేస్తామని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహించాలని జాయింటు కలెక్టరు తెలిపారు. డిఆర్‌ఒ జె.వెంకటరావు మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 185718 ఫారాలు స్వీకరించగా, వాటిలో 176638 ఫారాలు పరిష్కరించి ఓటరు జాబితాలో చేర్పిస్తామని, 2089 ఆమోదం చేయడం జరిగిందని, 4582 తిరస్కరణకు గురయ్యాయని, 2410 పరిష్కరించాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో ఎస్‌డిసిఆర్‌ కేశవనాయుడు, ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రతినిధి పి.రవికుమార్‌, బిఎస్‌పి పార్టీ ప్రతినిధి టి.వెంకటరమణ, బిజెపి ప్రతినిధి పి.అప్పారావు, లోక్‌ సత్తా పార్టీ ప్రతినిధి ప్రభాకరరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️