జిల్లా అభివృద్ధిలో 2023 కీలకం : కలెక్టర్‌

Dec 30,2023 21:05

పార్వతీపురంరూరల్‌: జిల్లా అభివృద్ధిలో 2023 సవత్సరం కీలక పాత్ర పోషించిందని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అన్నారు. సమగ్రమైన జిల్లాగా రూపాంతరం చెందేందుకు, అభివృద్ధి పథంలో ముందుకు సాగడంలో ఈ ఏడాది బాగా సహకరించిందని, 2024 నూతన సంవత్సరం కూడా జిల్లా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని ఆకాంక్షించారు. కలెక్టరేట్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. 2023లో అభివృద్ధి లక్ష్య సాధనలో పూర్తి స్థాయి దృష్టి సారించామని, తద్వారా మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. అలాగే ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరుగుతుందని, ఈ ఏడాది ఇప్పటి వరకు 1.08 లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రూ.132 కోట్ల విలువ చేసే ధాన్యం కొనుగోలు చేసి ఇప్పటి వరకు రూ.58 కోట్లు చెల్లించామని, మిగిలిన మొత్తం మూడు రోజులలో జమ కానుందని అన్నారు. గృహ నిర్మాణ రంగంలో మంచి అభివృద్ధి సాధించి రాష్ట్రంలో నాలుగో స్థానంలో జిల్లా ఉందన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కింద రూ.44.73 కోట్లతో పనులు మంజూరు చేశామని, అందులో 400 పనులు పూర్తయ్యాయని, 1413 పనులు ప్రగతిలో ఉన్నాయని తెలిపారు. ప్రాధాన్య తా భవనాల పను ల్లో గ్రామ సచివాల యాల భవనాలు 125, రైతు భరోసా కేంద్రాలు వంద పూర్తి చేశామని, ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాలు (వెల్‌ నెస్‌ కేంద్రం) 192 నిర్మాణంలో ఉన్నాయని కలెక్టర్‌ చెప్పారు. రూ.1259 కోట్లతో రహదారులు మంజూరు చేశామన్నారు. వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. 37 పిహెచ్‌సిల్లో సిబ్బంది పూర్తి స్థాయిలో నియామకం జరిగిందన్నారు. జిల్లాలో మాతా, శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గించామని చెప్పారు. జిల్లా ఏర్పాటు చేసిన సమయంలో మరణాల రేటు 28 ఉండగా ప్రస్తుతం 9 తగ్గిందన్నారు. ఉద్యాన కళాశాల వద్ద వైద్య కళాశాల నిర్మాణానికి మట్టి పరీక్షలు జరిగాయని, డిజైన్‌ తుది రూపంలో ఉందని చెప్పారు. కురుపాం, భద్రగిరి, సీతంపేట సిహెచ్‌సిల ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, సీతంపేటలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు ఇంకా 20 శాతం మిగిలి ఉన్నట్టు తెలిపారు. పార్వతీపురంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు వేగవంతమవుతున్నాయని చెప్పారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జిల్లాలో 292 శిబిరాలు నిర్వహించగా 1,29,191 మంది వైద్య సేవలు వినియోగించుకున్నారని చెప్పారు. వైఎస్‌ఆర్‌ చేయూత నాలుగో విడతలో 77,995 మందికి జనవరి 5 నుంచి రూ.146.39 కోట్లు పంపిణీ జరుగుతుందన్నారు. జల్‌ జీవన్‌ మిషన్‌ కింద 40 వేల గృహాలకు ఇంటింటికీ కొళాయిలు వేశామని, ఈ వారంలో 2 వేల ఇళ్లకు కొళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. జిల్లాలో కమ్యూనికేషన్‌ వ్యవస్థను పెద్ద ఎత్తున నెలకొల్పామని, మారుమూల గ్రామాలకు సెల్‌ ఫోన్‌ నెట్వర్క్‌ అందించామన్నారు. ఈ ఏడాది జిల్లాలో 2540 మంది లబ్ధిదారులకు 1947 ఎకరాల్లో డి – పట్టా భూములు పంపిణీ చేశామని, మరో 506 ఎకరాల్లో 681 మందికి పంపిణీ చేసే ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. జిల్లాలో 300 గ్రామాల్లో రీ సర్వే పూర్తయ్యిందని, భూ హక్కు పత్రాలు పంపిణీ చేసినట్టు తెలిపారు. విద్యా వ్యవస్థ మెరుగు ముఖ్యంగా టెన్త్‌ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతకు ”మై స్కూల్‌ మై ప్రైడ్‌” కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ ఏడాది అన్ని రంగాల్లో గణనీయ ప్రగతి సాధించామని, ఇందుకు సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, భాగస్వాములు అయిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

➡️