జ్వరాల గుర్తింపుపై దృష్టిసారించాలి

Mar 22,2024 21:34

పార్వతీపురంరూరల్‌: క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టి జ్వరాలు గుర్తించడంపై సిబ్బంది దృష్టి సారించాలని జోనల్‌ మలేరియా అధికారి డాక్టర్‌ ఎం.శాంతిప్రభ స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ టి.జగన్‌ మోహనరావు ఆధ్వర్యంలో ఆరోగ్య పర్యవేక్షకులు, ఆరోగ్య సహాయకులకు స్థానిక ఎన్జీఓ హౌంలో శుక్రవారం నిర్వహించిన రీ ఓరియంటేషన్‌ శిక్షణా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శాంతిప్రభ మాట్లాడుతూ క్షేత్ర స్థాయి సిబ్బంది నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం ఫీవర్‌ సర్వలెన్స్‌ చేపట్టి, త్వరితగతిన జ్వరాలు గుర్తించాలని ఆదేశించారు. తద్వారా చికిత్స సత్వరమే అందించి జ్వర తీవ్రతను నియంత్రించవచ్చన్నారు. రాబోయే సీజన్లో జ్వరాలను అదుపులో ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సంసిద్ధం కావాలని, శిక్షణలో పొందిన పరిజ్ఞానం సద్వినియోగం చేసుకోవాలన్నారు. దోమలు వృద్ధి చెందే స్థావరాలను గుర్తించడం, నియంత్రణా చర్యలు చేపట్టడంపై ఎక్కువ దృష్టి సారించాలన్నారు. డాక్టర్‌ జగన్మోహనరావు మాట్లాడుతూ రీ ఓరియంటేషన్‌ ట్రైనింగ్‌ రెండు రోజులు ఉంటుందని, కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమానికి సంబందించి ప్రతి అంశాన్ని పవర్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరిస్తున్నామన్నారు. శిక్షణా కార్యక్రమంలో ఎఎంఒ సూర్యనారాయణ, జిల్లా విబిడి కన్సల్టెంట్‌ రామచంద్రరావు, మైక్రోబయాలజిస్ట్‌ డాక్టర్‌ అప్పారావు, ఇఒ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

➡️