తాత్సారం చేస్తే మూల్యం తప్పదు

Feb 16,2024 21:47

 పార్వతీపురం రూరల్‌ :సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తాత్సారం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి (జెఎసి) హెచ్చరించింది. ఈ మేరకు మూడో రోజు శుక్రవారం పలు ఉద్యోగ, పింఛన్‌దారుల సంఘం నాయకులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో స్థానిక కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల ఉమ్మడి సమస్యల పరిష్కారం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో పోరాటానికి కార్యాచరణ ప్రకటించాల్సి వచ్చిందన్నారు. తక్షణమే మధ్యంతర భతి (ఐఆర్‌) 30% ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. అలాగే ఉద్యోగులు తమ సొంత డబ్బును సబ్స్క్రిప్షన్‌ గా కడుతూ పిఎఫ్‌, ఎపిజిఎల్‌ రుణాలు, పార్టీ ఫైనల్స్‌ దరఖాస్తు చేసుకొన్న నెలలు తరబడి పెండింగ్లో ఉన్నాయన్నారు. సరెండర్‌ లీవ్‌ ఎన్‌కేషన్‌మెంట్‌, మెడికల్‌ రీయంబర్స్మెంట్‌, 11వ సిఆర్పి డిఎ బకాయిలు, ఉద్యోగుల టిఎ, డిఎ బకాయిలు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నాయన్నారు. తక్షణమే రూ.25వేల కోట్లు బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జెఎసి చైర్మన్‌ జివిఆర్‌ కిషోర్‌, పింఛనుదారుల సంఘం కార్యదర్శి డి.గణపతి రావు, ఆరోగ్య శాఖ ఉద్యోగ ప్రతినిధులు బి.పుష్ప, కె.రాణితో పాటు ఎపి ఎన్జీవో, ఎపి ట్రెజరీ, మెడికల్‌, క్లాస్‌ ఫోర్‌, పంచాయితీ రాజ్‌ శాఖ, మున్సిపాలిటీ, పంచాయతీ గ్రామ, వార్డు సచివాలయ సంఘ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

➡️