నిబద్ధత కలిగిన అధికారి జెసి గోవిందరావు

Feb 17,2024 19:54

పార్వతీపురం : జాయింటు కలెక్టరు ఆర్‌.గోవిందరావు నిబద్దత, కష్టపడేతత్వం గల అధికారి అని, అప్పగించిన పనిని సకాలంలో పూర్తిచేసే వారని జిల్లా కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. జిల్లా నుంచి బదిలీపై వెళ్తున్న జాయింటు కలెక్టరు ఆర్‌.గోవిందరావును శనివారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం ఘనంగా సన్మానించి, వీడ్కోలు పలికారు. అనంతరం కలెక్టరు మాట్లాడుతూ జాయింటు కలెక్టరుగా గోవిందరావు పనిచేసిన కొద్దికాలంలోనే తనదైన ముద్రవేసుకొన్నారన్నారు. ధాన్యం సేకరణ, రీసర్వే వంటి పనులను సమర్ధవంతంగా పూర్తిచేశారని తెలిపారు. అనంతరం బదిలీపై వెళ్తున్న జెసి గోవిందరావు మాట్లాడుతూ జిల్లాలో పనిచేసిన కాలంలో విధులు సమర్దవంతంగా నిర్వర్తించడంలో మార్గనిర్దేశం చేసిన కలెక్టరు నిశాంత్‌ కుమార్‌కు, సహకరించిన అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. తాను గతంలో పార్వతీపురం ఆర్‌డిఒగా పనిచేశానని, జెసిగా ఉద్యోగోన్నతి పొంది గతంలో పనిచేసిన జిల్లాకు రావడం ఎంతో సంతోషం కలిగించిందని తెలిపారు. జిల్లాలో ధాన్యం సేకరణ, రీసర్వే, జగనన్నసురక్ష, ప్రజాపంపిణీ వ్యవస్థ, ఆడుదాం ఆంధ్ర, ఇ-క్రాప్‌ బుకింగు, కులగణన వంటి అంశాల్లో రాష్ట్ర స్థాయి సూచీల్లో తొలి అయిదు స్థానాల్లో జిల్లా ఉండడం తనకు చాలా సంతోషం, సంతృప్తి కలిగించిందని తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ జి.కేశవ నాయుడు, పార్వతీపురం, పాలకొండ ఆర్‌డిఒలు కె.హేమలత, వి.వి.రమణ, జిల్లా పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారి ఎంవిఆర్‌ కృష్ణాజీ, డిపిఒ బి.సత్యనారాయణ, జిల్లా ఆర్‌.డబ్ల్యు.ఎస్‌ ఇంజినీరింగ్‌ అధికారి ఒ.ప్రభాకర రావు, డిఇఒ పగడాలమ్మ, జిల్లా బిసి సంక్షేమ సాధికారిత అధికారి ఎస్‌.కృష్ణ, జిల్లా ప్రజా రవాణా అధికారి టి.వి.ఎస్‌.సుధాకర్‌, డిఎస్‌డిఒ ఎస్‌.వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్‌ పాల్‌, జిల్లా ఖజానా అధికారి ఎ.మన్మథరావు, జిల్లా కలెక్టర్‌ కార్యాలయ విభాగ అధిపతులు, తహశీల్దార్లు, ఎంపిడిఒలు తదితరులు పాల్గొన్నారు.

➡️