ప్రచారానికి అనుమతి తప్పనిసరి

Mar 22,2024 21:31

పార్వతీపురంరూరల్‌ : ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రచారానికి అనుమతులు తప్పనిసరని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా అన్నారు. ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాజకీయ పార్టీలు చేసే ఇంటింటి ప్రచారంతో సహా ఎటువంటి ప్రచారానికైనా అనుమతులుండాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు నిర్వహించే ఎటువంటి కార్యక్రమాలకైనా ముందుగా అనుమతి తప్పని సరిగా పొందాల్సి ఉందన్నారు. నేరుగా గానీ, ఎన్కోర్‌ పోర్టల్‌ ద్వారా గానీ అందే దరఖాస్తులను వెంటనే పరిశీలించి సకాలంలో అనమతులు మంజూరు చేయాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో సీజర్స్‌ అంశంపై ఎన్ఫోర్సుమెంట్‌ ఏజన్సీలను అప్రమ్తతం చేయాలని, జిల్లా పరిధుల్లోనే కాకుండా సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను పటిష్టపర్చాలని సూచించారు. ప్రతి సరిహద్దు చెక్‌పోస్టు వద్ద కనీసం ఒక కెమెరాతో స్టాటిక్‌ సర్వలెన్సు టీమ్‌ను పెట్టాలని ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం జారీచేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం దాదాపు 33 అత్యవసర సేవల శాఖల ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని కల్పించిందన్నారు. ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన అథారిటీ లెటర్‌ కలిగి ఎన్నికల విధుల్లో పాల్గొనే మీడియా ప్రతినిధులతో పాటు ఆయా శాఖల ఉద్యోగులకు వారి విజ్ఞప్తి మేరకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని కల్పించాలని ఆదేశించారు. శాంతి భద్రతల నిర్వహణ విషయంలో అప్రమ్తతంగా ఉండాలని, ఎటువంటి దుర్ఘటనలకు తావులేకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దురదృష్టవశాత్తు ఎటు వంటి ఘటనలు జరిగినా తక్షణమే తగు చర్య తీసుకోవడంతో పాటు ఆ సంఘటనకు సంబంధించిన వాస్తవ నివేదికను వెంటనే తమకు పంపాలని ఆదేశించారు. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగింపునకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఫార్ము-7లో వివరాలను సరిదిద్దేందుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఫారం -8ను చట్టబద్దమైన విధానంలో ఈనెల 26లోపు పరిష్కరించాలని ఆదేశించారు. కొత్త ఓటర్ల నమోదులో ఎంతో అప్రమత్తంగా ఉండాలని, చివరి నిమిషంలో హడావుడిగా ఓటర్ల నమోదు చేపట్టొద్దని, క్రమ పద్దతిలో వ్యక్తిగతంగా దాఖలు చేసిన ఫారం – 6ను క్షుణ్ణంగా పరిశీలించిన తదుపరి మాత్రమే కొత్త ఓటర్లుగా నమోదు చేయాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుండి ప్రతి రోజూ 9నివేదికలను భారత ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉందని, ఈ నివేదికలు పంపే విషయంలో ఏమాత్రం అలక్ష్యం వహించకుండా సకాలంలో నివేదికలను అందజేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్‌ కుమార్‌, ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ జి.కేశవ నాయుడు, పార్వతీపురం, పాలకొండ ఆర్‌డిఒలు కె.హేమలత, ఎ.వెంకటరమణ, ఎస్డిసి ఆర్‌వి సూర్యనారాయణ, నోడల్‌ అధికారులు మున్సిపల్‌ కమిషనర్‌ పాల్గొన్నారు.

➡️