ప్రచార భారం భరించడమెలా?

Mar 23,2024 20:31

సాలూరు : సాధారణ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్‌ నిర్వహణకు రెండు నెలలు గడువు ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నోటిఫికేషన్‌ విడుదల కాగానే ఎన్నికల ప్రచారం చేపట్టే పరిస్థితి కనబడడం లేదు. మే 13న పోలింగ్‌ నిర్వహణకు ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఎక్కువ సమయం ఉండడంతో ప్రచారభారం తడిసి మోపెడవుతుందని టిడిపి, వైసిపి అభ్యర్థులు భావిస్తున్నారు. ప్రచారంలోకి దిగిన తర్వాత కార్యకర్తలు, అభిమానులు, నాయకుల ఖర్చులు అభ్యర్థులే భరించాల్సి ఉంటుంది. రెండునెలల పాటు ఈ ఖర్చులన్నీ భరించడం తలకు మించిన భారంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మద్యం, బిరియాని, రోజువారీ ఖర్చులతో పాటు వాహనాల ఇంధనం ఖర్చులు కలిపి అభ్యర్ధులే భరించాలి. ఇవే కాక ఓటర్లకు డబ్బులు, మద్యం పంపిణీ చేయాల్సి ఉంది. ఇవన్నీ పోలింగ్‌ తేదీకి వారం పది రోజుల్లో జరగాల్సి ఉంటుంది. రెండునెలల ముందుగానే ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తే మరిచిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎపి ఎన్నికలు నాలుగో విడత జరుగనున్నాయి. ఏప్రిల్‌ 18న ఎపి ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నెలరోజుల ముందుగా ప్రచారం చేపడితే ఖర్చుల భారం తగ్గించుకోవచ్చుననే అభిప్రాయం ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో కనిపిస్తోంది. తాజా పరిస్థితుల్లో పలువురు నాయకులు ఇంకా ప్రచారానికి శ్రీకారం చుట్ట లేదు. ప్రచారం ప్రారంభించే లోగా పార్టీకి చెందిన అసంతృప్తి వాదుల బుజ్జగింపులు, చేరికలు, వ్యూహాలు ఎత్తుగడలపై సీనియర్‌ నాయకులతో సమాలోచనలు జరుపుతున్నారు. టిడిపి అభ్యర్థి సంధ్యారాణి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రచార రథంతో ఎన్నికల శంఖారావం పూరించారు. ఆమె కూడా ప్రత్యర్ధి పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

➡️