ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్‌ పరీక్షలు

Mar 1,2024 20:42

పార్వతీపురంరూరల్‌ : ఇంటర్‌ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా, విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. 8.30 గంటలకు విద్యార్థులను లోపలికి అనుమతించారు. విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి అనుమతించారు. ఎటువంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు అనుమతించలేదు. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతి లేదని ముందే ప్రకటించడంతో పరీక్ష రాసే విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకున్నారు. దూర ప్రాంతాలకు చెందిన వారు 8 గంటలకే కేంద్రాలకు చేరుకున్నారు. మరో వైపు విద్యార్దులను వారి తల్లిదండ్రుల బైక్‌లు, ఆటోలపై తీసుకొని రావడం జరిగింది. విద్యార్థులు పరీక్ష రాసేందుకు హాల్‌ టికెట్‌, పెన్‌, అట్ట తప్ప ఎటువంటి ఇతర వస్తువులు లోపలికి అనుమతించలేదు. మొదటి ఏడాది పరీక్ష రాస్తుండడంతో విద్యార్థులు తమ వెంట వచ్చిన తల్లిదండ్రులు వచ్చి శుభాకాంక్షలు చెప్పి పంపించారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. పరీక్ష ప్రశాంతం ఆర్‌ఐఒమొదటి రోజు ఇంటర్మీడియట్‌ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యా అధికారి డి.మంజుల వీణ తెలిపారు. 6208 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 5869 మంది హాజరు అయ్యారని, 339 మంది గైర్హాజరు అయ్యారని ఆమె అన్నారు. వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి 3420 మంది రాయాల్సి ఉండగా 2945 మంది హాజరయ్యారని, 475 గైర్హాజరు అయ్యారని తెలిపారు. జిల్లాలో మొత్తం 32 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆమె చెప్పారు. పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశామని తెలిపారు.పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించిన ఏఎస్పీ ప్రశాంతమైన వాతావరణంలో ఇంటర్‌ పరీక్షలు జరిగేలా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా అదనపు ఎస్పీ డాక్టర్‌ ఒ.దిలీప్‌ కిరణ్‌ తెలిపారు. పట్టణంలోని భాస్కర్‌ జూనియర్‌ కళాశాల, గవర్నమెంట్‌ జూనియర్‌ కళాశాలలోని ఇంటర్‌ పరీక్షా కేంద్రాలను జిల్లా అదనపుఎస్పీ ఆకస్మికంగా సందర్శించారు. పరీక్షా కేంద్రాల చుట్టూ ఉన్న పరిసరాలను, తీసుకున్న భద్రతా చర్యలు, పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. పరీక్షా కేంద్రాల చీఫ్‌ సూపెరింటెండెంట్స్‌, ఇతర అధికారులు అనుసరించాల్సిన నిబంధనలపై పలు సూచనలు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్‌ 144 అమల్లో ఉన్నందున ఎవరూ గుంపులుగా ఉండకూడదన్నారు. తగిన ఎస్కార్ట్‌ తో ప్రశ్నపత్రాల తరలింపు, సమాధాన పత్రాలు డిపాజిట్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. వీరఘట్టం : స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పరీక్ష కేంద్రంలో పారంభమైన ఇంటర్‌ మొదటి సంవత్సర పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు చీఫ్‌ సూపరింటెండెంట్‌ ఎం.కుమారస్వామి తెలిపారు. ఈ పరీక్షకు 260 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా జనరల్‌ తెలుగు పరీక్ష సంబంధించి 13 మంది విద్యార్థులు, జిఎపిఎఫ్‌ సంబంధించి ఐదుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. డిపార్ట్మెంట్‌ అధికారి ఎస్‌.నాగభూషణరావు పర్యవేక్షణలో పరీక్ష నిర్వహించారు. కురుపాం : స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు శుక్రవారం చీఫ్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌.ఉషారాణి పర్యవేక్షణలో ప్రశాంతంగా జరిగాయి. 624 మంది విద్యార్థులకు 112 మంది విద్యార్థులు పరీక్షకు గైరాజరయ్యారని, ఒకేషనల్‌ 556 మందికి 107 మంది విద్యార్థులు గైర్హాజవ్వగా జనరల్‌ 68మంది విద్యార్థులకు 5 గురు విద్యార్థులు గైరాజరైనట్లు ఆమె తెలిపారు. డిఒలుగా డి.తవిటినాయుడు, పిసి శర్మ వ్యవహరించారు.గుమ్మలక్ష్మీపురం : మండలంలో ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు శుక్రవారం మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. భద్రగిరి పిటిజి, భద్రగిరి బాలురు గురుకుల కళాశాల, జూనియర్‌ కళాశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పిటిజిలో 281 మంది విద్యార్థులకు తెలుగు 247 , హిందీ 18 మంది విద్యార్థుల పరీక్షలు రాశారు. భద్రగిరి బాలుర పాఠశాలలో 369 మంది విద్యార్థులకు అందరూ హాజరయ్యారు. ప్రభుత్వ జూని యర్‌ కళాశాలలో 431 మందికి 351 మంది హాజరై పరీక్షలు రాశారు. 80 మంది గైర్హాజర య్యారు. ఎటు వంటి అవాంఛ నీయ సంఘట నలు జరగ కుండా పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేం దుకు 144 సెక్షన్‌ విధిం చారు. ఎల్విన్‌ పేట ఎస్‌ఐ బి శివ ప్రసాద్‌ బందోబస్తు నిర్వహించారు.సీతంపేట : ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. స్థానిక బాలికల గురుకుల కళాశాలలో 224 మంది విద్యార్థులకు 222 పరీక్షలు రాశారు. ఇద్దరు గైరాజరయ్యారు. ఈ పరీక్షా కేంద్రంలో బాలికల కళాశాల విద్యార్థులు మల్లి ప్రతిభ కళాశాల విద్యార్థులు బాలుర కళాశాల విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అలాగే ఐటిడిఎలో ఉన్న బాలుర గురుకుల కళాశాలలోని పరీక్షా కేంద్రంలో 273 మంది విద్యార్థులకు 268 మంది పరీక్షలు రాశారు. తెలుగు పరీక్షకు ఐదుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. డిపార్ట్మెంటు అధికారులుగా సూర్యకుమారి, నాగభూషణరావు వ్యవహరించారు.సీతానగరం: మండలంలోని రెండు పరీక్షా కేంద్రాల్లో మొదటిరోజు ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సాధారణ కోర్సుల్లో 104మంది విద్యార్థులకు గాను ఇద్దరు గైర్హాజరు కాగా, 102మంది హాజరయ్యారని చీఫ్‌ సూపరింటెండెంట్‌ దాసరి త్రినాథ్‌ తెలిపారు. వృత్తివిద్యా కోర్సుల పరీక్షలకు సంబంధించి 160మంది విద్యార్థులకు గానూ 128 హాజరయ్యారని చీఫ్‌ సూపరింటెండెంట్‌ దాసరి త్రినాథ్‌ తెలిపారు. అలాగే మండలంలోని జోగింపేట ప్రతిభా కళాశాలలో 157మందికి గాను ఆరుగురు అబ్సెంటు కాగా, 151మంది పరీక్షలకు హాజరైనట్లు చీఫ్‌ సూపరింటెండెంట్‌ పోల వెంకట నాయుడు తెలిపారు. సుకన్య, ధనలక్ష్మి డిపార్టుమెంటు అధికారులుగా వ్యవహరిస్తున్నారు. ఎస్‌ఐ ఎం.రాజేష్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ బందోబస్తు నిర్వహించారు.బలిజిపేట : మండలంలో ప్రారంభమైన ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా జరిగాయి, మండలంలోని రెండు పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. పిఎస్‌ఎన్‌ కళాశాల, స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 307 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా తొలిరోజు 20 మంది గైర్హాజరయ్యారు. శనివారం నుండి ద్వితీయ ఇంటర్మీడియట్‌ విద్యార్థులు పరీక్ష రాయవలసి ఉంది.కొమరాడ: స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శుక్రవారం ఇంటర్మీడియట్‌ ప్రథóమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. చీఫ్‌ సూపరింటెండెంట్‌ జి. సత్యనారాయణ, డిపార్ట్మెంటల్‌ అధికారి జి తేజేశ్వర్‌ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. మొదట పరీక్షకు 286 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 267 మంది హాజరయ్యారు. 19 మంది గైర్హాజరయ్యారని డిఒ తెలిపారు. పరీక్షలు పారదర్శకంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతున్నాయని అన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేందుకు విద్యార్థులకు ఉచిత బస్సు సర్వీసులను ఆర్‌టిసి కల్పించినట్లు తెలిపారు.

➡️