ప్రశాంత వాతావరణంలో ఎన్నికలకు చర్యలు

Mar 1,2024 20:36

పార్వతీపురం : రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుటకు, ఓటరు నిర్బయంగా ఓటు హక్కును వినియోగించుకొనేందుకు కావాల్సిన ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నట్లు జిల్లా కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటరు గుర్తింపు కార్డుల ముద్రణ – పంపిణీ, ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కారం, ఫిర్యాదులు, ప్రతికూల వార్తలు, పోలింగ్‌ కేంద్రాల్లో కనీస వసతుల కల్పన తదితర అంశాలపై తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన కంట్రోల్‌ రూం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి ఫారం 7, 8లపై అభ్యంతరాలను సేకరిస్తున్నామన్నారు. వీడియో, ఫోటో గ్రాఫర్ల నియమాకాలకు చర్యలు తీసుకోవడం జరిగిందని, ఎన్ఫోర్స్‌ మెంట్‌ ఏజన్సీలను నియమించామన్నారు. శిక్షణా కార్యక్రమంలో ఇన్‌ఛార్జి జాయింట్‌ కలెక్టరు సి. విష్ణుచరణ్‌, సీతంపేట ఐటిడిఎ పిఒ కల్పనాకుమారి, ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ జి.కేశవనాయుడు, ఆర్‌డిఒలు కె.హేమలత, వి.వి.రమణ ఇతర అధికారులు పాల్గొన్నారు.

➡️