బాబు మోసగాడు, పవన్‌ వేషగాడు

Jan 29,2024 20:59

సాలూరు: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడని, ఆయన పార్ట్‌నర్‌ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వేషగాడని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మున్సిపాలిటీ, మండలం పరిధిలోని డ్వాక్రా మహిళలకు ఆసరా పథకం కింద చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2014లో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పి నిలువునా మోసగించారన్నారు. ఆయన మాటలు నమ్మి మహిళలు టిడిపికి ఓటేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత టోపీ పెట్టారని అన్నారు. అలాగే రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసిన ఘనత బాబుదేనన్నారు. ఇప్పుడు జనసేన నాయకులతో కలిసి టిడిపి నాయకులు మళ్లీ మోసపూరిత వాగ్దానాలతో ప్రజల ముందుకు వస్తున్నారని చెప్పారు. వైసిపి ప్రభుత్వ హయాంలో రూపాయి ఖర్చు లేకుండా పేదలకు నేరుగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి ప్రభుత్వాన్ని వద్దనుకుంటే నష్టపోయేది పేదలేనని అన్నారు. నియోజకవర్గంలో తన హయాంలో ఎక్కడెక్కడ ఏం అభివృద్ధి పనులు జరిగాయో చెప్పడానికి సిద్ధంగా వున్నానని అన్నారు. ఇప్పటికే అనేక సార్లు అభివృద్ధిపై చర్చకు రావాలని కోరినా టిడిపి నాయకులు ముందుకు రాలేదని చెప్పారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన భంజ్‌ దేవ్‌, ఒకసారి ఎమ్మెల్సీగా చేసిన సంధ్యారాణి నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మహిళలు టిడిపి నాయకులను ప్రశ్నించాలని రాజన్నదొర కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పువ్వుల ఈశ్వరమ్మ, వైస్‌ చైర్మన్లు జర్జాపు దీప్తి, వంగపండు అప్పలనాయుడు, అర్బన్‌ బ్యాంక్‌ అధ్యక్షులు జర్జాపు ఈశ్వరరావు, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి జర్జాపు సూరిబాబు, జెసిఎస్‌ కన్వీనర్‌ గిరిరఘు, కౌన్సిలర్లు రాపాక మాధవరావు, పప్పల లక్ష్మణరావు, ఎంపిపి రాములమ్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌ పర్సన్‌ రెడ్డి పద్మావతి, సీనియర్‌ నాయకులు దండి శ్రీనివాసరావు, వైస్‌ ఎంపిపిలు రెడ్డి సురేష్‌, సువ్వాడ గుణవతి, మండల వైసిపి అధ్యక్షులు సువ్వాడ భరత్‌ శ్రీనివాసరావు, మండల జెసిఎస్‌ కన్వీనర్‌ కె.త్రినాధనాయుడు, కమిషనర్‌ టి.జయరాం, ఎంపిడిఒ జి.పార్వతి పాల్గొన్నారు.కొమరాడ : మండల కేంద్రంలో జరిగిన వైయస్సార్‌ నాలుగో విడత ఆసరా చెక్కును మహిళా సంఘ సభ్యులకు కురుపాం ఎమ్మెల్యే పి.పుష్పశ్రీవాణి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తుందన్నారు. కావున ఈనిధులను మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ పీడీ కిరణ్‌కుమార్‌, ఎంపిడిఒ ఎం.మల్లిఖార్జునరావు, ఎపిఎం వెంకటరమణ, ఎపిడి, డిపిఎంలు, జెడ్‌పిటిసి సభ్యులు ద్వారపురెడ్డి లక్ష్మి, ఎంపిపి శెట్టి శ్యామల, వైస్‌ ఎంపిపిలు నంగిరెడ్డి శరత్‌బాబు, హిమరక అన్నపూర్ణ, స్థానిక ఎంపిటిసి సభ్యులు ఎం.అశ్విని, వైసిపి కన్వీనర్‌ జనార్దన, పిఎసిఎస్‌ అధ్యక్షులు ఎం. సురపనాయుడు, గోపాలకృష్ణ , పలువురు వైసిపి నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.పార్వతీపురం టౌన్‌ : అక్కాచెళ్లమ్మల ఆర్థిక స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మహిళా పొదుపు సంఘాల రుణ మాఫీ చేసి అండగా నిలిచారని స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. స్థానిక జూనియర్‌ కాలేజ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన వైయస్‌ఆర్‌ ఆసరా 4వ విడత సంబరాలు కార్యక్రమంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు పాల్గొని మాట్లాడారు. ఎన్నికల హామీలలో ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులకు రుణమాఫీ చేసి వారి రుణం తీర్చుకున్నారని అతని రుణం తీర్చుకోవాలంటే ప్రతి ఒక్కరూ వైసిపికి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బి గౌరేశ్వరి, వైస్‌ చైర్‌ పర్సన్‌ కొండపల్లి రుక్మిణి, పార్టీ పట్టణ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, మెప్మా పీడీ, మున్సిపల్‌ కమీసనర్‌, వివిధ వార్డుల కౌన్సిలర్‌ సభ్యులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, మెప్మా సిబ్బంది, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

➡️