మతోన్మాద శక్తులను ఎండగట్టాలి

Mar 22,2024 21:30

 సీతానగరం : దేశంలో ప్రస్తుతం మతోన్మాదం వెర్రితలలు వేస్తుందని, కావున భగత్‌ సింగ్‌ ఆశయాలను, ఆకాంక్షలను, భావాలను విరివిగా ప్రజల్లో తీసుకువెళ్లి మతోన్మాద శక్తులను ఎండగట్టాలని సిపిఎం రాష్ట్ర సీనియర్‌ నాయకులు ఎం.కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. భగత్‌ సింగ్‌ వర్థంతి సభ శుక్రవారం సీతానగరంలో జరిగింది. ఈ సందర్భంగా భగత్‌సింగ్‌ చిత్రపటానికి కృష్ణమూర్తి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కృష్ణమూర్తి మాట్లాడుతూ 23 ఏళ్ల వయసులోనే ఉరి కంభాన్ని ముద్దాడి వీరమరణం పొందారని, ఆనాటి బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు కొనసాగిస్తున్న దోపిడీని వ్యతిరేకిస్తూ సంపూర్ణ స్వాతంత్య్రం కోసం, భారతమాత ద్రాస్య శృంఖాలాలను తెంచి, బ్రిటీష్‌ వారి కబంధహస్తాల నుంచి విముక్తిగా వించిన పోరాటయోధుడని అన్నారు. తాను నాస్తికుడ్ని ఎలా అయ్యాను అనే పుస్తకం ద్వారా మతోన్మాద శక్తులను వ్యతిరేకించాడన్నారు. భగత్‌ సింగ్‌ మరణించి నేటికి 90 ఏళ్లయినా ఇంకా ఈ దేశంలో దోపిడీ కొనసాగుతుందని, మతోన్మాదం వెర్రితలలు వేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. నేడు కేంద్రంలో మతోన్మాద ప్రభుత్వం అధికారం ఉందని, దీని ప్రమాదాన్ని ప్రజల్లో తీసుకువెళ్లి మతోన్మాద శక్తులను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బిజెపి ఆవలంభిస్తున్న విధానాలు దేశ ప్రజల ఆర్థిక, సామాజిక భద్రతకు తీవ్ర నష్టం చేస్తున్నప్పటికీ, రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి బిజెపిని వ్యతిరేకించకపోగా బలపర్చడం, జట్టు కట్టడం సిగ్గుచేటని విమర్శిం చారు. వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే మూడు వ్యవసాయ చట్టాలను, కార్మికులకు నష్టం చేకూర్చే లేబర్‌ కోడ్‌లను బిజెపి తీసుకువస్తే టిడిపి, వైసిపి బలపర్చాయని దుయ్యబట్టారు. బిజెపికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతుగా ఉన్న టిడిపి, వైసిపిలను ఓడించి ప్రజల తరఫున నికరంగా పోరాడుతున్న సిపిఎం అభ్యర్థులను రాబోయే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి లక్ష్ము నాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిపిఎం నాయకులు రెడ్డి ఈశ్వరరావు, సిఐటియు నాయుకులు జి.వెంకటరమణ, ఐద్వా ఉపాధ్యక్షులు వి.రామలక్ష్మి, రైతు సంఘం నాయకులు బోరపరెడ్డి అప్పారావు, రెడ్డి రమణ మూర్తి , తదితరులు పాల్గొన్నారు.

➡️